U-19 WC | యువ భారత్‌కు ‘ఫైనల్’ షాక్..

  • అండర్-19 ఆసియా కప్ పాకిస్తాన్ కైవసం

అండర్-19 ఆసియా కప్-2025 టోర్నీలో అజేయంగా దూసుకుపోయిన భారత్, ఫైనల్లో తడబడింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో పాకిస్తాన్ 191 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించి, రెండోసారి ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత్, కీలకమైన ఫైనల్లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు…

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. టోర్నీలో సెంచరీలతో విరుచుకుపడ్డ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (26) మెరుపులతో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టినా, ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (2) మరోసారి పేలవ ఫామ్‌ను కొనసాగించి నిరాశపరిచాడు. ఖిలాన్ పటేల్ (19), ఆరోన్ జార్జ్ (16) వంటి వారు త్వరగానే పెవిలియన్ చేరడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ బౌలర్ అలీ రజా 4 వికెట్లతో భారత బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు.

ఒక దశలో 120 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి అతి తక్కువ స్కోరుకే పరిమితమవుతుందనుకున్న దశలో, పదో స్థానంలో వచ్చిన బౌలర్ దీపేష్ దేవేంద్రన్ (36) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. అతను 16 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడంతో భారత్ 150 పరుగుల మార్కును దాటగలిగింది. చివరకు భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్‌లో దీపేష్ చేసిన పరుగులే అత్యధికం కావడం గమనార్హం.

పాక్ ఓపెనర్ మిన్హాస్ విధ్వంసం..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్ సమీర్ మిన్హాస్ కనీవినీ ఎరుగని ఆరంభాన్ని ఇచ్చాడు. భారత బౌలర్లను ఉతికేస్తూ మిన్హాస్ కేవలం 113 బంతుల్లోనే 17 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 172 పరుగుల విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా అహ్మద్ హుస్సేన్ (56) అర్ధ సెంచరీతో రాణించడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ, పాక్ బ్యాటర్ల జోరును అడ్డుకోవడంలో విఫలమయ్యారు.

ఈ విజయంతో పాక్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించగా, సమీర్ మిన్హాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరియు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.

Leave a Reply