ఆదికవి నన్నయ్య వర్సిటీలో మంత్రి లోకేష్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్సిటీలో రూ.34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను లాంఛనగా ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతి గదుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీసీ ఎస్. ప్రసన్నశ్రీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేశారు.
ఈ భవనాలకు తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా నదుల పేర్లను పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.20.05 కోట్లతో నిర్మించిన ఇంజినీరింగ్ కళాశాల భవనానికి ‘గౌతమి’ అని, రూ.8.25 కోట్లతో నిర్మించిన పరీక్షల విభాగానికి ‘మంజీర’ అని, అలాగే రూ.5.50 కోట్లతో సిద్ధం చేసిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనానికి ‘ఇంద్రావతి’ అని నామకరణం చేశారు.
ఈ భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించి, యూనివర్సిటీ ప్రాంగణంలో కలియతిరిగారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనతో అటు పురాతన కళాశాలలకు, ఇటు ఆధునిక విశ్వవిద్యాలయాలకు కొత్త జవజీవాలు అందాయి. ఈ కార్యక్రమాల్లో యూనివర్సిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రికి ఘనస్వాగతం పలికారు.
