నేను కూడా సైన్స్ విద్యార్థినేనని, రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేశానని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘జాతీయ సైన్స్‌డే’ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీపులో స్టేడియంలో ఉన్న స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులందరికీ కేంద్రమంత్రి, సీఎం అభివాదం చేశారు.
ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సర్ సీవీ రామన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్‌డీవో, డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ… తాను కూడా సైన్స్ విద్యార్థినే అని చెప్పారు.
‘సర్ సీవీ రామన్ ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలి. యువతి యువకులు శాస్తవ్రేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి. గ్లోబల్ లీడర్ షిప్ లో యువతదే కీలక పాత్ర. సైన్స్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలి. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుంది. ఈ శాఖకు గత కొద్ది సంవత్సరాలుగా మంత్రిగా ఉండటం నా అదృష్టం. సైన్స్ అండ్ టెక్నాలజీ లో కొత్త ఒరవడిని భారతదేశం సృష్టిస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అన్ని రంగాల్లో భారత దేశం అగ్రగామిగా ఉంది. మానవుని మేధ సంపత్తు చాలా గొప్పది’ అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.