ఎన్నికల ఏర్పాట్లపై నారాయణపేట అదనపు కలెక్టర్ సూచనలు

నారాయణపేట, ఊట్కూర్, ఆంధ్రప్రభ: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని నారాయణపేట రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. ఆయన ఎంపీడీవో కిషోర్ కుమార్, తాసిల్దార్ చింతా రవితో కలిసి ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు.
చిన్న గుండు పిన్ను వంటి అన్ని ముఖ్య సామగ్రి తప్పకుండా అందించబడేలా చూసుకోవాలని, సిబ్బంది సకాలంలో గ్రామాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. అలాగే, బ్యాలెట్ బాక్స్ నిల్వ గది, సామాగ్రి పంపిణీ ప్రాంతం, వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించారు.
అయితే, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని, పోలింగ్ కౌంటింగ్ కోసం అవసరమైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చింతా రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఆర్‌ఐలు కృష్ణారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
