పల్కపల్లిని అభివృద్ధి బాటలో నడిపిస్తా..

  • విలీన గ్రామాల అన్యాయాన్ని సరిదిద్దుతా..
  • సర్పంచ్ అభ్యర్థి వల్లపు సంతోష్ రెడ్డి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలంలోని పల్కపల్లి గ్రామం విలీన గ్రామంగా మారిన కారణంగా గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధికి దూరమైందని, దీనికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వల్లపు సంతోష్ రెడ్డి ఆరోపించారు.

ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో పల్కపల్లి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని, అపరిష్కృతంగా ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తిగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు నిస్వార్థంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు.

ఈ ఎన్నికల్లో తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గ్రామ పెద్ద, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, పల్కపల్లి గ్రామాన్ని అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో చేర్చడం వల్ల స్థానికంగా సర్పంచ్‌లను ఎన్నుకునే హక్కు కోల్పోయి గ్రామాభివృద్ధికి తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చిత్తశుద్ధితో చేసిన కృషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని తెలిపారు. అర్హులైన 23 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు, రూ.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

అలాగే గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు 25 విద్యుత్ స్తంభాలు, ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమని పేర్కొన్న గోపాల్ రెడ్డి, పల్కపల్లి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వల్లపు సంతోష్ రెడ్డికి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply