Messi Mania | హైదరాబాద్‌లో మెస్సీ సందడి..

Messi Mania | హైదరాబాద్‌లో మెస్సీ సందడి..
హైదరాబాద్ (ఆంధ్రప్రభ) : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్, ఆల్‌టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ (Lionel Messi) నేడు ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో నగరంలో మెస్సీ మేనియా మొదలైంది. మెస్సీ రాకతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొనగా, ఆయన పర్యటన సందర్భంగా నగరంలో భారీ ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఇక నగరంలో అడుగుపెట్టిన మెస్సీ… శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ పోలీసు భద్రత మధ్య నేరుగా చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత కచ్చితమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే వారికి క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేశారు.
ఈ సందర్భంగా మెస్సీతో ‘మీట్ అండ్ గ్రీట్’ & ఫోటో సెషన్‌కు కేవలం 250 మందికి మాత్రమే అనుమతి లభించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ప్యాలెస్‌కు చేరుకున్నారు.

ఫలక్‌నుమా ప్యాలెస్ కార్యక్రమం అనంతరం మెస్సీ సాయంత్రం 7 గంటలకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి బయలుదేరనున్నారు. స్టేడియంలో సాయంత్రం 5:30 గంటల నుంచే సంగీత కార్యక్రమాలు ప్రారంభం కానుండగా., మెస్సీ సాయంత్రం 7:00 నుండి 7:30 గంటల మధ్య స్టేడియానికి చేరుకుంటారు. ఆయన సుమారు గంట పాటు మైదానంలో అభిమానుల మధ్య గడపనున్నారు.
అనంతరం అక్కడ జరిగే చారిటీ మ్యాచ్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆడనున్నారు. అంతేకాకుండా, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ హోదాలో మెస్సీ చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు.
మెస్సీ పర్యటన, చారిటీ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సుమారు 3,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియం సామర్థ్యం 39,000 అయినప్పటికీ, కేవలం పాస్‌లు/టికెట్లు, క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే అనుమతి లభిస్తుందని, పాస్‌లు లేనివారు స్టేడియానికి రావద్దని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు.
Messi | స్టేడియంలో మెస్సి అభిమానుల ఆగ్రహం
అంతేకాకుండా, నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచే రాత్రి 11:50 గంటల వరకు ఉప్పల్, పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. హబ్సిగూడ క్రాస్‌రోడ్స్, స్ట్రీట్ నెం. 8 వద్ద వాహనాలను మళ్లిస్తున్నారు. భారీ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) వైపు మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సులు/మెట్రో రైలు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానుల కోసం.. స్టేడియానికి కిలోమీటరు పరిధిలో 10 ప్రధాన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. అయితే పాస్‌లు లేని వాహనాలను ఏక్ మినార్, ఎల్జీ గోడౌన్ చెక్‌పోస్టుల వద్దే నిలిపివేయనున్నారు. ఇప్పటికే టికెట్ పొందిన ఫుట్‌బాల్ ప్రియులు తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
