Commissioner | శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం

Commissioner | శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు..
- రెండో విడత పంచాయితీ ఎన్నికలకు భారీ బందోబస్తు
- రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
Commissioner | గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ పరిధిలో రెండో విడత పాలకుర్తి, అంతర్గా, జూలపల్లి, ధర్మారం నాలుగు మండలాలలో 73 గ్రామపంచాయతీలు, 97 పోలింగ్ కేంద్రాలలో 684 పోలింగ్ లొకేషన్స్ లో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1680 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1161 ఉన్నాయని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 519 ఉన్నట్లు తెలిపారు.
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, డీసీపీ – 02, ఏసీపీ- 07, సీఐలు – 30, ఎస్ఐలు- 95, ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు – 270, కానిస్టేబుళ్లు – 520, హోంగార్డులు- 240, ఆర్ముడ్ సిబ్బంది- 190, క్యూఆర్టీ టీమ్స్- 32, రూట్ మొబైల్ పార్టీలు- 62, మిగతా సిబ్బంది, సుమారు 200, మొత్తంగా సుమారు 1700 మంది పోలీస్, భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేశామని స్పష్టం చేశారు.
చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, స్థానిక పోలీస్, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ కోరారు. పోలీస్ సిబ్బందితో రూట్ మొబైల్స్, క్రింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కమిషనరేట్ లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు క్రిటికల్ పోలింగ్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించడం జరిగిందని సీపీ తెలిపారు.
