BRS Candidate | డ‌బ్బులివ్వండి… లేదంటే చ‌స్తాం…

BRS Candidate | డ‌బ్బులివ్వండి… లేదంటే చ‌స్తాం…

  • ఓటేశామని దేవుడి మీద ప్రమాణమైనా చేయండి.
  • నల్లగొండ జిల్లా ఔరవాణిలో ఓడిపోయిన అభ్యర్థి బాలరాజు దంపతుల వినూత్న నిరసన

BRS Candidate | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో నాకే ఓటేస్తారని నమ్మి మీకు డబ్బులు ఇచ్చాను.. అయినా మీరు నాకు ఓటేయలేదు.. అందువల్లే ఓడిపోయాను.. నమ్మి మోసపోయిన నాకు తిరిగి డబ్బులు అయినా ఇవ్వండి.. లేదంటే నీకే ఓటేశానని దేవుడు మీద ప్రమాణం అయినా చేయండి అంటూ నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి దంపతులు శనివారం వినూత్న నిరసనకు దిగారు.

తొలి విడతలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఔరవాణి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన కల్లూరి బాలరాజు పోటీ చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో బాలరాజు తాహతుకు మించి ఓటర్లకు డబ్బులు పంచాడు. కాంగ్రెస్ పలపరిచిన జక్కిలి పరమేష్ బాలరాజుపై 448 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా విజయం సాధించాడు. దీంతో తాను నమ్మిన గ్రామస్తులు డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ బాలరాజు చేతిలో దేవుని పటం పట్టుకోగా.. ఆయన భార్య క్రిమిసంహారక మందును చేతిలో పట్టుకొని శనివారం ఉదయం గ్రామంలోని ఇంటింటికి తిరిగారు.

తనకే ఓటేశామని దేవుడిపై ప్రమాణమైనా చేయండి.. లేదంటే మా డబ్బులు మాకైనా ఇవ్వండి అంటూ బాలరాజు దంపతులు గ్రామస్తులను వేడుకున్నారు. ఓడిపోయిన అభ్యర్థి ఊహించని విధంగా ఇలాంటి చర్యకు పూనుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో గెలుద్దామనుకున్న అభ్యర్థి ఓడిపోయి ఇలా ఇచ్చిన డబ్బులను తిరిగి అడగడం సరైనది కాదని పలువురు గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగడం కనిపించింది.

Leave a Reply