మంగళగిరి టౌన్ (ఆంధ్రప్రభ). మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆసుపత్రి భవన నమూనాపై అధికారులతో మంత్రి సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి. అత్యాధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలన్నారు. వంద పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్ గా ఆసుపత్రి నిలవాఅని అభిలషించారు.. ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలన్నారు. రోగులు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. డాక్టర్లు, పేషంట్లు, విజిటర్స్ కోణంలో జోన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు.
పేరెన్నికగన్న ఆసుపత్రుల భవన నమూనాలను పరిశీలించి అందకనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలన్నారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలన్నారు. పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాను రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఏపీఎమ్ఎస్ఐడీసీ(ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) సీఈ జి.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ వి.చిట్టిబాబు, ఈఈ సీవీ రమణ, భార్గవ్ గ్రూప్ చీఫ్ ఆర్కిటెక్చర్ శ్రీమతి నిఖిల, ఏపీఎమ్ఎస్ఐడీసీ డీఈఈ ఎమ్. హనుమంతరావు నాయక్, ఏఈ జి.గోపీచంద్, ఏఈ కె.శివ సత్యనారాయణ, భార్గవ్ గ్రూప్ డీజీఎమ్ ఏ.శ్యామ్ కిషోర్, సీనియర్ ఇంజనీర్ డి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.