తాత రాజారెడ్డి పేరుతో అత్యాధునిక హాస్పటల్
10 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం
జగన్ చూసేందుకు భారీగా వచ్చిన జనం
ఆనందంగా ప్రతి ఒక్కరిని పలకరించిన జగన్
కాబోయే సీఎం అంటూ నినాదాల హోరు
పులివెందుల (ఆంధ్రప్రభ) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తన నియోజకవర్గం పులివెందులలో రెండోరోజైన నేడు రూ. 10 కోట్లతో ఆధునికీకరణ చేసిన వైయస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఆసుపత్రిని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. అనంతరం ఆయన ఆస్పత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే ఉన్న డాక్టర్లతో ఆయన కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందించింది అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. అయితేఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ వైద్యశాలకు వైఎస్సార్ ఫౌండేషన్ స్థలం సమకూర్చడంతో పాటు సుమారు రూ. 10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి, అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆస్పత్రిని అధునికీకరించడం విశేషం అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది అన్నారు. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అక్కడే ఉన్న సిబ్బందిని అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అక్కడున్న సిబ్బంది జగన్ తో సెల్ఫీలు దిగారు.
అంతకుముందుగా ఆసుపత్రిలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి నుండి బయటికి రాగానే బయట ఉన్న జన సంద్రోహాన్ని చూసి ఆయన ఆనందంగా ప్రతి ఒక్కరిని పలకరించారు. ఉన్న ప్రజలు జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నినాదాలు చేశారు. ఎక్కడున్నా వారితో ఆయన సెల్ఫీలు తీసుకుని వారిని ఆనందింపజేశారు. ఆయనతో కరచాలన చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు.