Training | కానిస్టేబుల్ అభ్యర్థులకు 22 నుంచి ట్రైనింగ్ !!

Training | కానిస్టేబుల్ అభ్యర్థులకు 22 నుంచి ట్రైనింగ్ !!

  • మహిళలకు రెండు కేంద్రాలలో….
  • పురుషులకు… 9 కేంద్రాలలో శిక్షణ…!!

పల్నాడు ప్రతినిధి (ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి శిక్షణ మొదలుకానుంది. ముందుగా ఈ నెల 16న మంగళగిరి బెటాలియన్ లోని పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులతో సహా ఈ ప్రారంభకార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం.. అభ్యర్థులంతా వారి సొంత ఊళ్లకు వెళ్లి, తిరిగి 22వ తేదీ లోపు వారికి కేటాయించిన పీటీసీ, డీటీసీ, బీటీసీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

అక్కడ 9 నెలల పాటు వారికి శిక్షణ ఉంటుంది. తొలి విడత నాలుగున్నర నెలల పాటు శిక్షణ పూర్తయ్యాక వారం రోజుల పాటు సెలవులిస్తారు. తర్వాత రెండో విడత శిక్షణ ఉంటుంది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, 6,015 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారిలో 5,551 మంది ‘ఫిట్ ఫర్ ట్రైనింగ్ (శిక్షణకు అర్హత)’ సర్టిఫికేట్ పొందారు. వీరందరికీ ఇప్పుడు శిక్షణ ఇవ్వనున్నారు.

ఇదిలా ఉండగా.. ఉద్యోగాలకు ఎంపికైన సివిల్ కానిస్టేబుల్ (3507) లకు ఈనెల 22 నుంచి వారి, వారికి కేటాయించిన కేంద్రాలలో శిక్షణ ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళ (1063) కానిస్టేబుల్స్ కు ఒంగోలు, అనంతపురం పోలీసు ట్రైనింగ్ సెంటర్స్ లో శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా పురుషు (2444) లకు రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.

పోలీసు ట్రైనింగ్ సెంటర్లు( పి టి సి) అయిన… తిరుపతి, అనంతపురంలో… జిల్లా ట్రైనింగ్ సెంటర్లు( డిటిసి) అయిన… శ్రీకాకుళం, పెదవేగి (ఏలూరు), ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం కేంద్రాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కాగా శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా వారి వారికి కేటాయించిన కేంద్రాలలో రిపోర్టు చేయవలసిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. 9 నెలల పాటు శిక్షణ ఉంటుంది. తొలి విడత నాలుగున్నర నెలల పాటు శిక్షణ పూర్తయ్యాక… వారం రోజుల పాటు సెలవులిస్తారు. తర్వాత రెండో విడత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply