Railway Line | కీలక గేట్వేగా కుప్పం

Railway Line | కీలక గేట్వేగా కుప్పం
Railway Line | చిత్తూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం, కర్ణాటక (Karnataka) రాష్ట్రం ఆంధ్ర సరిహద్దులో ఉన్న మరికుప్పం మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రైల్వే లైన్ కల అధికారికంగా అమలు దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం 24 కిలోమీటర్ల పొడవుతో, రూ. 297 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నాలుగు రోజుల క్రితం పార్లమెంటులో స్పష్టంగా ప్రకటించారు. మచిలీపట్నం ఎంపీ బాలచౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలను వెల్లడించడంతో, కుప్పం పరిసర ప్రజల్లో అభివృద్ధి ఆశలు కొత్తగా చిగురించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు అయ్యింది. దీంతో కుప్పం బెంగళూరు మధ్య దూరం తగ్గడమే కాకుండా రవాణా చార్జీలు కూడా తగ్గుతాయి. కుప్పం నుండి కూరగాయలు, పండ్లు త్వరగా బెంగళూరుకు రవాణా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య రైల్వే (Railway) అనుసంధానాన్ని పూర్తిగా మార్చబోయే కీలక మౌలిక నిర్మాణం. కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపి) కింద ప్రాజెక్ట్ చేర్చటం కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం తెచ్చింది. దేశంలోని అత్యవసర మౌలిక ప్రాజెక్టుల్లో ఈ లైన్‌కు స్థానం లభించడం వల్ల, నిధుల విడుదల, పనుల పురోగతి వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. మరికుప్పం స్టేషన్ పరిధిలో ఇప్పటికే పనులు స్పష్టంగా కనిపించేంత దశకు చేరాయి. కొత్త ట్రాక్‌ల వేసే ప్రక్రియ, యార్డు విస్తరణ, సబ్వే నిర్మాణం వంటి కీలక పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రయాణికుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌ఫారాల అప్‌గ్రేడేషన్, సాంకేతిక మార్పులు కూడా ఈ దశలోనే చేపడుతున్నారు. మరో వైపు కుప్పం వైపు భూసేకరణ, సర్వేలు, భూమి మలక–కట్టింగ్ వంటి పనులు పూర్తి కావటానికి దగ్గరగా ఉన్నాయి.
ఈ లైన్ పూర్తవడం ద్వారా లాభం కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు. వాణిజ్యం, పారిశ్రామిక కార్యకలాపాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు అన్ని కలిసి కొత్త దిశలో పరిగెత్తే అవకాశాలు ఉన్నాయి. కేజిఎఫ్, కోళార్, బెంగుళూరు పక్క ప్రాంతాలకు ఇది అత్యంత సమీప రైల్వే లింక్‌గా పని చేస్తుంది. ఇప్పటి వరకు రోడ్డుమార్గం పై (Road) ఆధారపడే ప్రయాణం, రవాణా ఇప్పుడు రైల్వే ద్వారా సమయాన్ని, ఖర్చును తగ్గిస్తుంది. కుప్పం ప్రాంత రైతులు కూడా పండ్లు, కూరగాయలు, ధాన్యం లాంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద నగరాల మార్కెట్లకు సులభంగా రవాణా చేయగలుగుతారు. మరొక కీలక అంశం ఏమిటంటే.. తిరుపతి, బెంగళూరు రూట్ డబ్లింగ్. కుప్పం మీదుగా వెళ్లే ఈ సింగిల్ లైన్ ప్రస్తుతం భారీ రద్దీని తట్టుకోలేకపోతోంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదన మేరకు ఈ లైన్‌ను డబుల్ లైన్‌గా మార్చే అవకాశం పరిశీలనలో ఉంది. కొత్త కుప్పం, మరికుప్పం లైన్ కూడా అమల్లోకి రావడం వల్ల ఈ ప్రాంతం మొత్తం రైల్వే మ్యాప్‌లో కీలక జంక్షన్‌గా మారే అవకాశం ఉంది.
ఆర్థిక పరంగా చూస్తే, రూ. 297 కోట్ల ప్రాజెక్ట్ చిన్నది కాదు. ఇందులో ట్రాక్ (Track) నిర్మాణం, భూసేకరణ, ఎర్త్‌వర్క్, బ్రిడ్జ్‌లు, సిగ్నలింగ్, స్టేషన్ల నూతనీకరణ ప్రధాన భాగాలు. ఈ పనుల వల్ల స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు రావడంతో పాటు, పారిశ్రామిక వృద్ధికి కూడా గట్టి మద్దతు లభిస్తుంది. కుప్పం ప్రాంతం ఇటీవలి సంవత్సరాల్లో రాజకీయంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఈ రైల్వే ప్రాజెక్ట్ మరింత బలమైన మద్దతు ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల భవిష్యత్ రవాణా వ్యవస్థలో ఈ మార్గం కీలక పాత్ర పోషించనుందని, ఇది పూర్తయిన తర్వాత ప్రజల ప్రయాణ అనుభవం పూర్తిగా మారిపోతుందని అధికారులు చెబుతున్నారు. అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించిన ఈ వివరాలతో, కుప్పం, మరికుప్పం రైల్వే లైన్ ఆచరణ దిశగా వేగంగా పయనిస్తున్న ఒక ముఖ్య జాతీయ మౌలిక నిర్మాణ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.
