పోతిరెడ్డిపాడు–బనకచర్ల కాంప్లెక్స్ లక్ష్యం దారి తప్పింది…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: రాయలసీమ సాగునీటి అవసరాల కోసం అత్యంత కీలకంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు–బనకచర్ల కాంప్లెక్స్ అసలు లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తోందని, దీనిని మళ్లీ సరైన దిశలో నడిపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాకు విజ్ఞప్తి చేశారు.

శనివారం సమితి కార్యవర్గ సభ్యులతో కలిసి కలెక్టర్‌ను ఆయన కలిశారు. బనకచర్ల కాంప్లెక్స్ నుండి కృష్ణా జలాల పంపిణీ పరిస్థితిపై సమగ్ర సంక్షిప్త నోటును అందజేశారు.

ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… రాయలసీమకు నీరు అందించాల్సిన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ వ్యవస్థ పూర్తిగా దారితప్పిందని, కృష్ణా జలాలను రాయలసీమ పంటపొలాలకు చేరవేయాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన అలక్ష్యం కారణంగా బనకచర్ల కాంప్లెక్స్ కుందు నదిలోకి జలాలను మళ్లించే వ్యవస్థగా మారిపోయిందని కలెక్టర్‌కు వివరించారు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్కులు తీసుకుంటే 30 రోజుల్లో 120 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు అందించవచ్చని వివరించారు. ఈ క్రమంలో…. ప్రధాన కాలువల్లో అవరోధాల తొలగింపు, పంటకాలువల నిర్మాణం, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, గాలేరు–నగరి, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీటి ప్రవాహం నిరంతరంగా ఉండేలా చర్యలు తక్షణం చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.

రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందేలా తగిన చర్యలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు యర్రం శంకర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి నిట్టూరు సుధాకర్ రావు, సభ్యులు భాస్కర్ రెడ్డి, అడ్వకేట్ అసదుల్లా మియా పాల్గొన్నారు.

Leave a Reply