ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని ఊట్కూర్ తహసీల్దార్ చింత రవి అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయులని గుర్తు చేశారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పించాలన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ న్యాయం చేసేందుకు రాజ్యాంగాన్ని రచించి, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందించేందుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చినప్పుడే నిజమైన నివాళులర్పించిన వారమవుతామని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర రెడ్డి, ఆర్ఐలు వెంకటేష్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

