CCTNS | హోంగార్డుల సేవలకు సెల్యూట్

CCTNS | హోంగార్డుల సేవలకు సెల్యూట్

  • వారి సంక్షేమమే మా ల‌క్ష్యం


జిల్లా ఎస్పీ తుషార్ డూడి

CCTNS | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు పరేడ్ గ్రౌండ్‌లో 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసుల (Police) నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హోంగార్డులు నిర్వహించిన కవాతు ప్రదర్శనను వీక్షించారు. హోం గార్డ్ వ్యవస్థ 1946లో ఆవిర్భ‌వించి, 1963 డిసెంబర్‌ 6న దేశసేవ కోసం పౌరులు స్వచ్ఛందంగా ముందుకు రానున్న వేదికగా తీర్చిదిద్దబడిందని గుర్తుచేశారు. ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా నిలిచే ఈ వ్యవస్థ కమ్యూనిటీ పోలీసింగ్‌లో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

పోలీసులతో సమానంగా శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి గస్తీ, నేరాల అరికట్టడం, సీసీటీఎన్‌ఎస్‌ (CCTNS) వంటి సాంకేతిక విధుల్లో హోంగార్డులు చూపుతున్న కృషి అమూల్యమని ఎస్పీ అభినందించారు. “మీ కవాతు చూసిన తరువాత పోలీసులు నడిచే క్రమశిక్షణ మీలో ప్రతిబింబించింది… ఇదే నిబద్ధతతో ప్రజా సేవ కొనసాగాలి. అవినీతికి దూరంగా విధులు నిర్వహించండి. ఏ సమస్య ఉన్నా నేరుగా నన్ను సంప్రదించండి” అని సూచించారు.

ఉత్తమ సేవలు అందించిన 13 మంది హోంగార్డులకు (Homeguards) ఉత్తమ, అతి ఉత్తమ సేవా పతకాలు అందజేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు, 2024లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. హోంగార్డుల పిల్లలలో చదువులో ప్రతిభ చూపిన వారికి పదో తరగతి నుంచి ఎంటెక్‌ వరకు ఎస్పీ స్వయంగా హాజరై స్కాలర్‌షిప్‌లు అందించడం ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకతగా నిలిచింది.

పరేడ్ ముగిసిన తరువాత ఎస్పీ జెండా ఊపి ర్యాలీని (Rally) ప్రారంభించారు. సాయుధ దళాల కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ, గాంధీ కూడలి, ఎమ్‌ఎస్‌ఆర్‌ కూడలి మీదుగా ప్రయాణించి తిరిగి పోలీసు కార్యాలయ ప్రాంగణానికి చేరుకుంది. జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తుండగా, మరో 139 మంది వివిధ శాఖల్లో డెప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు. పండుగలు, వీఐపీ పర్యటనలు, ప్రకృతి వైపరీత్యాల వంటి కీలక సందర్భాల్లో వీరి సేవలు అత్యంత విలువైనవని ఎస్పీ వివరించారు.

హోంగార్డు సంక్షేమం కోసం చిత్తూరు పోలీసు శాఖ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిందని, ఈ నిధి ద్వారా గాయపడిన హోంగార్డులకు ఇరవై వేల రూపాయలు, మరణించినప్పుడు తక్షణ సహాయంగా అదే మొత్తాన్ని, రిటైర్మెంట్ (Retirement) సమయంలో మూడు లక్షల యాభై వేల రూపాయల కానుక వంటి సదుపాయాలు అందజేస్తున్నట్లు తెలిపారు. నలభై ఏళ్లు పైబడిన హోంగార్డులకు ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. హోంగార్డుల వేతనం నుండి ప్రతి నెలా యాభై రూపాయలు సంక్షేమ నిధికి జమ చేసి అవసర సమయంలో వినియోగించబడుతున్నట్లు చెప్పారు. మహిళా హోంగార్డులకు వేతనంతో కూడిన మూడు నెలల ప్రసూతి సెలవు, హోంగార్డు కుమార్తె వివాహానికి ఐదు వేల రూపాయల సాయం, నెలకు రెండు రోజులు వేతనంతో కూడిన సెలవు వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు వివరించారు. హోంగార్డుల పిల్లలకు ప్రతి సంవత్సరం వెయ్యి నుండి నాలుగు వేల రూపాయల వరకు ప్రతిభా ప్రోత్సాహక వేతనం అందజేస్తూ వారిని చదువులో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

దురదృష్టవశాత్తు సేవలో మరణించిన హోంగార్డులకు మట్టి ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయలు, సహజ మరణానికి పదిహేను వేల రూపాయలు, ప్రమాద మరణానికి ఇరవై వేల రూపాయల సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. పోలీసు శాఖలో నియామకాలకు హోంగార్డులకు ప్రత్యేక రిజర్వేషన్ (Special Reservation) కల్పించడం కూడా కీలక నిర్ణయం అని చెప్పారు. సివిల్‌, ఆర్మ్డ్‌ రిజర్వు విభాగాల్లో 8 నుండి 15 శాతం, ప్రత్యేక పోలీసు దళాల్లో 25 శాతం, అగ్ని మాపక దళంలో 5 శాతం రిజర్వేషన్‌తో పాటు గరిష్ట వయోపరిమితిని 32 సంవత్సరాలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధాన మంత్రి భీమా పథకాల ద్వారా ప్రమాద భీమా రక్షణ లభిస్తోందని, బ్యాంకు ద్వారా హోంగార్డులకు ముప్పై లక్షల ప్రమాద భీమా సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు.

ఈ వేడుకలో అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు, చిత్తూరు డిఎస్పీ (DSP) సాయినాథ్, ఏఆర్‌ డిఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ బాష, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర, టూటેౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, ఈస్ట్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్ నిత్యబాబు, వెస్ట్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ మనోహర్, క్రైమ్‌ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, ఆర్ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సంఘం అధ్యక్షుడు ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply