- గ్రామ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి – అమృత రవళి
సదాశివనగర్, ఆంధ్రప్రభ : సమాజ సేవనే లక్ష్యంగా పెట్టుకుని గత ఏడు సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న విద్యావంతురాలు అమృత రవళి రాజేందర్ రావు, లింగంపల్లి గ్రామ సర్పంచ్ పదవికి బలంగా పోటీ చేస్తున్నారు. సోషల్ వర్క్, ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎం.ఏ., బి.ఎడ్ చదివిన ఆమె, సమాజ అభివృద్ధినే పరమావధిగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమృత రవళి గ్రామంలో అనేక కీలక కార్యక్రమాలు చేపట్టారు. 18 నుండి 70 ఏళ్ల వయస్సు గల ప్రతీ వ్యక్తికి రూ. 2 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారు. గ్రామంలో పుట్టిన ఆడపిల్లలకు బంగారు తల్లిగా రూ. 2,000 డిపాజిట్ ఏర్పాటు చేయగా, మరణించిన కుటుంబాలకు కులం, వర్గం తేడా లేకుండా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్, మురుగు నీటి వ్యవస్థ నిర్మాణం, శివాలయం వరకు రోడ్డులు వేయడం, సోలార్ లైటింగ్ ఏర్పాటు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా మార్చి స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతినెలా గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించడానికి నెహ్రూ యువ కేంద్రంతో కలిసి పనిచేశారు. వైకుంఠ ధామం అభివృద్ధి, స్వచ్ఛంద సంస్థలు మరియు CSR నిధుల ద్వారా గ్రామ సంక్షేమానికి కావాల్సిన వనరులు సమీకరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
గ్రామంలోని పూర్తి కాని వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించి, హరిత వనాలు, జల సంరక్షణ, ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. పాడి పరిశ్రమలకు అవసరమైన సహకారం అందించడానికి కూడా కృషి చేశారు. పీఎం ఆవాస్ యోజన కింద అర్హులకు గృహాల కోసం సహాయం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ అర్హుడికి చేరేలా కృషి చేసింది ఆమె ప్రత్యేకత. పురాతన కట్టడాలు, దేవాలయాల అభివృద్ధికి కృషి చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీటి (మినరల్ వాటర్) సౌకర్యం అందించారు. నిరుద్యోగుల కోసం ఉచిత వైఫై, పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల్లో విజయం సాధిస్తే గ్రామాన్ని పూర్తిస్థాయి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేస్తానని అమృత రవళి రాజేందర్ రావు హామీ ఇస్తున్నారు. తన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

