- గతేడాది కంటే తగ్గిన ప్రమాదాలు, మరణాల సంఖ్య..
- ద్విచక్ర వాహనాల వల్లే అధిక ప్రమాదాలు..
- ఎన్ హెచ్ 65 లో ప్రమాదాలు, మరణాలు అధికం..
- రహదారులపై వేగ పరిమితులు తెలిపే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి..
- ఓవర్ లోడింగ్ వాహనాలపై చర్యలు చేపట్టండి..
- జిల్లా రహదారి భద్రత కమిటీ (డి ఆర్ ఎస్ సి) సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ..
ఆంధ్రప్రభ, విజయవాడ : 2024తో పోలిస్తే 2025లో ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ (డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ) సమావేశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ… 2024లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 1343 ఉండగా, ఈ సంవత్సరంలో 918 కి తగ్గిందని చెప్పారు. మరణాలలోనూ తగ్గుదల కనిపించిందని, 432 నుంచి 317 కి తగ్గాయని తెలిపారు. వివిధ శాఖలు సమన్వయంతో కలిసి చేపట్టిన చర్యల వల్ల ఈ పురోగతి సాధ్యమైందన్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో మూడోవంతు ప్రమాదాలు, మరణాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని చెప్పారు. జాతీయ రహదారిలో ఎన్ హెచ్ 65 లో 58 శాతం ప్రమాదాలు, 41 శాతం మరణాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
రహదారులపై వేగ పరిమితులను (స్పీడ్ లిమిట్స్) తెలిపే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను నియంత్రించాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలలో బాధితులను రక్షించిన వారిపై (గుడ్ సమారిటన్) ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయరని, పోలీసు విచారణ పేరిట ఇబ్బందులు ఉండవని చెప్పారు. అలాంటి ప్రాణదాతలను సత్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రహదారి ప్రమాదాల నివారణలో ఎన్జీవోలు భాగస్వాములు కావాలని కోరారు.
ఆ ప్రాంతాలలోనే అధికంగా..
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ… భవానిపురం, ఇబ్రహీంపట్నం, పటమట, కంచికచర్ల, కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. బస్టాండ్, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు మొదలైన ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలన్నారు.
తరచూ ప్రమాదాలు సంభవించే బ్లాక్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. పౌరులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి కొత్త యాప్ ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు.
రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన వారిలో ద్విచక్ర వాహనదారులు 202 మంది ఉండగా, పాదచారులు 102 మంది ఉన్నారని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ప్రమాదాలు, మరణాలు తగ్గాయని రానున్న సంవత్సరంలో మరణాలను బాగా తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు.
మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులలో శిక్షల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, డీసీపీ (ట్రాఫిక్) షేక్ షెరీన్ బేగం, డి ఆర్ ఎస్ సి సభ్య కార్యదర్శి, ఆర్ & బి ఎస్ఈ జీవి భాస్కరరావు, డిపిఓ లావణ్య, డీఈవో సుబ్బారావు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, ఎన్జీవో డైరెక్టర్ ఎం వాసు, పోలీస్, రవాణా శాఖల అధికారులు , స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

