Revanth Reddy | వరంగల్ కు సీఎం రేవంత్ వరాలు…
- నర్సంపేటలో రూ. 532.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వరాల జల్లు కురిపించారు. నర్సంపేట నియోజకవర్గానికి ఏకంగా రూ. 532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు.
రూ. 532.24 కోట్లతో శంకుస్థాపనలు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట పట్టణంలో మొత్తం రూ. 532.24 కోట్ల వ్యయంతో పలు కీలక అభివృద్ధి, మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. విద్య, వైద్యం, రహదారి విస్తరణ వంటి ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగకరమైన రంగాలకు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.
ఇందులో భాగంగా రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ. 130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హన్మకొండ–నర్సంపేట–మహబూబాబాద్ రహదారి విస్తరణ, మరమ్మతులకు రూ. 82.56 కోట్లు, నర్సంపేట–నెక్కొండ రహదారి విస్తరణకు రూ. 56.40 కోట్లు కేటాయించారు.
అలాగే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు, నర్సంపేట పట్టణంలోని అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ. 20 కోట్లు, నర్సంపేట–పాఖాల రహదారి విస్తరణకు రూ. 17.28 కోట్లు ప్రకటించారు. మొత్తం మీద నర్సంపేట అభివృద్ధికి రూ. 532.24 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది.
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చీరల పంపిణీ
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్ల పాలనలో భారీగా ఆస్తులు సంపాదించుకున్నారు, ఫాంహౌస్‌లు కట్టుకున్నారు, విమానాలు కొన్నారు, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు, కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఉద్యమగడ్డ అయిన వరంగల్‌కు మాత్రం ఏమీ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
గతంలో కేసీఆర్ “వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే” అని అన్నారని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ వరికి ప్రోత్సాహకాలిస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్ పేటెంట్ తమ కాంగ్రెస్ పార్టీదేనని సీఎం స్పష్టం చేశారు. గత పాలకులు పదేళ్లలో ఏనాడూ రైతు రుణమాఫీ చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, ఈ ప్రభుత్వం 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
సౌర విద్యుత్ ని ఉత్పత్తి చేసే బాధ్యతను మహిళలకు అప్పగించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన ఇందిరమ్మ చీరల పంపిణీ కోడ్ ముగిసిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు అందేలా స్వయంగా తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఈ చీరలు గ్రామాల్లో మహిళలకు చేర్చే బాధ్యత సర్పంచ్‌లే తీసుకోవాలని సూచించారు.
వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదవాళ్లకు ఇచ్చారని గుర్తు చేస్తూ… పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చి పేదల్ని మోసం చేశారని విమర్శించారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 60 వేలకుపైగా ఉద్యోగాల భర్తీతో పాటు ఎన్నికల హామీలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న సౌకర్యాలు, అభివృద్ధి అవకాశాలు వరంగల్‌కూ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మార్చి 31 లోపల వరంగల్ మామునూరు ఎయిర్‌ఫీల్డ్ వద్ద ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే వరంగల్‌లో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్లు కూడా చెప్పారు.

