Rajkumar | జగన్మాతను దర్శించుకున్న నటుడు రాజ్ కుమార్..
ఆంధ్రప్రభ, విజయవాడ : రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్‌లో కూడ నటిస్తానని చెప్పారు. ప్రజలకు నరసయ్య చేసిన సేవలు తెలియజేయాలనే ఉద్దేశంతో హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం వేద అశీర్వచనం అందజేసి అమ్మవారి చిత్రపటం–ప్రసాదం అందజేశారు.
దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ…. దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందంగా, పాజిటివ్‌గా అనిపించిందన్నారు. తెలుగు రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటిస్తున్నట్టు తెలిపారు. విలువలతో కూడిన నాయకుడి జీవిత కథలో నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్‌లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమని తెలిపారు. రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” చిత్రంలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో గుమ్మడి నరసయ్య పాత్రను వెంటనే అంగీకరించినట్టు వివరించారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు తెలియజేయాలనే ఉద్దేశంతో హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. రేపు పాల్వంచలో చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం జరగనున్నట్లు శివరాజ్‌కుమార్ ప్రకటించారు.
అనంతరం దర్శకుడు పరమేశ్వర్ యుగాలే మాట్లాడుతూ…. మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య పేద ప్రజల సంక్షేమానికి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప వ్యక్తిని ఆ వ్యక్తి జీవిత కథను నేటి తరానికి తెలియజేసేందుకే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
శివరాజ్ కుమార్ కు తాను చెప్పిన బయోపిక్ లైన్ నచ్చడంతో ఈ చిత్రంలో హీరోగా నటించేందుకు అంగీకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గుమ్మడి నరసయ్య ఏ విధంగా ఉంటారో ఆయనను శివ రాజ్ కుమార్ రూపంలో వెండితెరపై చూపిస్తానని స్పష్టం చేశారు. శివ రాజ్ కుమార్ ను హీరోగా ఎంపిక చేయడంలో ఈ విధమైన కాంట్రవర్సీ లేదని సున్నితమైన కథ నచ్చడంతోనే ఆయన హీరోగా నటించేందుకు అంగీకరించారని వివరించారు.
బతికున్న వ్యక్తి బయోపిక్ ను తీయాలని ఉద్దేశంతోనే తాను గుమ్మడి నరసయ్య జీవిత చరిత్రను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. రేపు పాల్వంచలో ప్రజల సమక్షంలో ఈ చిత్ర షూటింగ్ ఘనంగా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు….

