రథోత్సవ వేడుకల్లో జనసందోహం..

  • వైభవంగా పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవ వేడుకలు
  • పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ప్రముఖులు
  • వేలాదిగా పాల్గొన్న భక్తులు

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రమే కాకుండా ముంబై, షోలాపూర్, పూణె, అంబర్‌నాథ్, గుల్బర్గా, యాదగిరి, హైదరాబాద్, ఆదోని వంటి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణల నడుమ రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి, ఆలయ ధర్మకర్త పి. ప్రాణేశాచారి ఆధ్వర్యంలో తేరు (రథం) పై ప్రతిష్ఠించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక–క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకటీ శ్రీహరి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు రథోత్సవానికి హారతులు పట్టారు. ఆ తరువాత బాణసంచా పేలుళ్ల మధ్య ‘జై శ్రీరామ్’, ‘జైజై శ్రీరామ్’, ‘రామ్ లక్ష్మణ్ జానకి జై’, ‘బోలో హనుమాన్‌కీ జై’ వంటి నినాదాలు నింగినంటగా మార్మోగాయి. భక్తుల నామస్మరణల నడుమ స్వామివారి రథాన్ని పడమర వైపున ఉన్న చిన్న ఆంజనేయస్వామి దేవాలయం వరకు లాగారు.

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథాన్ని తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు అనేక మంది భక్తులు సమీప భవనాల పైకప్పులపైకి ఎక్కి వీక్షించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పరస్పరం పోటీ పడ్డారు.

తదుపరి స్వామివారి పల్లకి సేవను పట్టణంలోని శ్రీ గోదా ఆంజనేయస్వామి దేవాలయం వరకు నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి, మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, BKR ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ల బాలకృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ గెడ్డంపల్లి హనుమంతు, మాజీ జెడ్పీటీసీ జి. లక్ష్మారెడ్డి, కొత్తకోట సిద్దార్థ రెడ్డి, కార్యనిర్వహణాధికారి కవిత, దేవాదాయశాఖ అధికారులు సత్యనారాయణ, ఆంజనేయులు, శ్రీనివాస్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply