KNR | అధిక లోడుతో గ్రానైట్ రవాణా..

- పట్టీలు విరిగి రోడ్డుపైనే నిలిచిపోయిన గ్రానైట్ లారీ.
- ధ్వంసం అవుతున్న గన్నేరువరం ప్రధాన రహదారి .
- ప్రత్యామ్నాయ రోడ్డు వేసుకోవాలని గ్రామస్తుల ధర్నా
గన్నేరువరం, ఆంధ్రప్రభ : మండలంలోని చాకలివాని పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీ కారణంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న గ్రానైట్ లారీ పట్టీలు విరగడంతో లారీ ముందుకు కదలలేని స్థితిలో నిలిచిపోయింది. దీంతో పాల కేంద్రానికి వెళ్లే రైతులు, గ్రామ ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో గ్రామ యువకులు రోడ్డుపై దిగిబడి ధర్నా చేశారు. ఓవర్‌లోడ్ లారీలు ఈ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలకు దారితీస్తున్నాయని, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశముందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్వారీ యాజమాన్యం రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నా పట్టించుకోకపోవడం, గ్రామస్తుల ఫిర్యాదులను అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల మండిపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అర్థం చేసుకుని, గ్రామ యువకులను శాంతింపజేశారు.
