- కాంగ్రెస్ భూ దోపిడీపై బీఆర్‌ఎస్ ఆగ్రహం
సనత్ నగర్, ఆంధ్రప్రభ : పరిశ్రమలకు కేటాయించిన భూములను ప్రజల అవసరాలకే వినియోగించాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లతో కలిసి సనత్ నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసాని తెలిపారు… 70, 80 సంవత్సరాల క్రితం నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటికీ, జనాభా పెరుగుదలతో నగరం విస్తరించడంతో పరిశ్రమలను బయటకు తరలించాల్సి వచ్చిందని చెప్పారు. తరలించిన పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరలకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
సనత్ నగర్ పరిధిలో ఇండస్ట్రియల్ ఉపయోగానికి 87.31 ఎకరాలు ఉంటే, రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 21 కోట్లు, ఓపెన్ మార్కెట్ విలువ 43–45 కోట్లు వరకు ఉంటుందని పేర్కొన్నారు. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ భూములను కేవలం ఎకరానికి 6.31 కోట్లకే ధారాదత్తం చేయాలని చూస్తోందని విమర్శించారు.
హైదరాబాద్‌లో 21 ప్రాంతాల్లోని 9,292 ఎకరాలను “ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ” పేరిట తక్కువ ధరలకు ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నం జరుగుతుందని, ఈ పాలసీ వెనుక సుమారు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగించబడిందని ఆరోపించారు.
కోటిన్నరకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్ల నిర్మాణం, పార్కులు, క్రీడా మైదానాలు, స్మశాన వాటికలు, బస్తీ దవాఖానాలు, మల్టీ పర్పస్ హాల్స్, అంగన్‌వాడి భవనాల కోసం స్థలాలు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
పరిశ్రమల భూముల్లో కనీసం 50 శాతం ప్రజా అవసరాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. తక్కువ ధరలకు భూములు పొందిన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టే ప్రమాదం ఉందని తెలిపారు.
ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలను దృష్టిలో పెట్టుకొని పాలసీలు రూపొందించడం దుర్మార్గమని తలసాని వ్యాఖ్యానించారు. పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న వారి భవిష్యత్ గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. భూ దోపిడీపై మంత్రి మండలి ప్రజల్లోకి వచ్చి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆఘమేఘాల మీదుగా పాలసీ తెచ్చి భూములను తక్కువ ధరకు కట్టబెట్టాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తలసాని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తప్పకుండా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలాన్ లక్ష్మీ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలాన్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

