Devotees | ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవలు..

Devotees | ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవలు..
ఇక అందుబాటులో వెబ్‌సైట్..
నూతన సంస్కరణలకు ఈవో శ్రీకారం ..
Devotees | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అమ్మనగన్నయమ్మ దుర్గమ్మను దర్శించుకొనే భక్తులకు దేవస్థానం (A temple for devotees) అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. రోజురోజుకు కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. త్వరత్వరగా భక్తులకు దర్శనం కల్పించేందుకు ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో దేవస్థానం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఆర్జిత సేవలకు మాత్రమే పరిమితమైన ఆన్‌లైన్ సౌకర్యాన్ని మిగిలిన సేవలు పొందేలా మార్పు చేసింది. దీంతో ఇంటిదగ్గర నుంచే దుర్గమ్మ దర్శనం, వసతి, ప్రసాదాలు, పూజల సేవలన్నింటిని పొందే అవకాశం కల్పించింది.
వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ సేవలు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం విజయవాడ వచ్చే భక్తులు సైతం దుర్గమ్మ దర్శనం కోసం ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దుర్గమ్మను దర్శించుకోలేక వెనుదిరగాల్సిన పరిస్థితులు కూడా ఇటీవల అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దూర ప్రాంత భక్తులు ముందస్తుగానే దుర్గమ్మ దర్శనం, ప్రసాదాలు, పూజలు, వసతి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో (Online) బుక్ చేసుకొనే సదుపాయాన్ని దేవస్థానం తీసుకువచ్చింది. ఈ సేవలు పొందేందుకు ఆలయ అధికారులు ప్రత్యేకంగా https://www.kanakadurgamma.org వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో వెళ్లి భక్తులు వారికి కావాలసిన సేవలను ముందస్తుగానే బుక్ చేసుకొనే సదుపాయం కల్పించింది. ఆర్జిత సేవలు, దర్శనం, ప్రసాదాలు, వసతి సౌకర్యాలు అన్ని ముందస్తుగానే రిజర్వు చేసుకొనే సాఫీగా అమ్మవారిని దర్శించుకునే వెసలుబాటు కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకొనే భక్తులకు దేవస్థానం కూడా ప్రత్యేక క్యూ మార్గంలో త్వరగా దుర్గమ్మ దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.

..వాట్స ప్ ద్వారా సేవలు..
వెబ్‌సైట్‌తో (Website) పాటు వాట్సప్ సేవలను కూడా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9552300009 నెంబరుకు వాట్స ప్ పంపి కూడా పూజల వివరాలు తెలుసుకోవడంతోపాటు టికెట్లు, ప్రసాదాలు, వసతి సౌకర్యాలు బుకింగ్ కూడా చేసుకొనే సదుపాయం కల్పించింది. కనకదుర్గమ్మ వారిని భక్తుల చెంతకు మరింత చెరువ చేసే క్రమంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సులభతరంగా సేవలను దేవస్థానం అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. భక్తులు ఈ ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీను నాయక్ కోరారు.
