- రెండోసారి ఏకగ్రీవమైన బాబా పూర్ పంచాయతీ
- ఏకగ్రీవ సర్పంచ్ గా మెస్రం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన బాబాపూర్ గ్రామ పంచాయతీ ఈసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైంది. పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల పటేళ్లు, పెద్దలు, గ్రామస్తులు కలిసి… సర్పంచ్‌గా మెస్రం గంగాదేవి ప్రభాకర్, ఉప సర్పంచ్‌గా మెస్రం చంద్రకళలను, అలాగే 8 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బాబాపూర్, ముసల్పాడు, రాజులు, ఎర్రచెలుక గ్రామాల పటేళ్లు, ఆదివాసీ పెద్దలు ఒకే నిర్ణయంతో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ ఎన్నికల్లో తొడసం దేవురావు సర్పంచ్‌గా, చిక్రం మనోహర్ ఉప సర్పంచ్‌గా ఎంపికయ్యారు.
ఈసారి 2025 ఎన్నికల్లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండోసారి బాబాపూర్ పంచాయతీ ఏకగ్రీవం సాధించడం విశేషం. ప్రతి పంచాయతీ ఎన్నికల్లో నాలుగు గ్రామాలు పరస్పర అంగీకారంతో ఒక గ్రామానికి సర్పంచ్ పదవి ఇవ్వాలని ముందే నిర్ణయించుకోవడం స్థానిక వ్యవస్థలో ఏకతను ప్రతిబింబిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
ఎన్నికల ఖర్చులు లేకుండా, ఏకగ్రీవ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్దతులను గౌరవిస్తూ పదవులు అప్పగించడం బాబాపూర్ గ్రామపంచాయతీని జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ ఆదర్శంగా నిలబెట్టింది.

