- హిందువులకు ప్రసాదం వితరణ
- చిత్తూరులో సర్వమత సామరస్యం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలోని అగస్తీశ్వరస్వామి ఆలయంలో ఒక విశిష్టమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముస్లిం కుటుంబ స్వయంగా హిందూ భక్తులకు ప్రసాదం అందజేస్తూ సర్వమత సామరస్య స్ఫూర్తిని మరింత బలపరిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఎంసీ విజయనందరెడ్డి సతీమణి ఎంసీ ఇందుమతి హర్షం వ్యక్తం చేశారు. మతాలకు అతీతంగా సేవ చేసే వారు సమాజానికి దారితీరు చూపుతారని అభినందించారు.
సోమవారం సాయంత్రం చిత్తూరు 44వ డివిజన్ కార్పొరేటర్ నాజీరా బేగమ్ అన్న, డివిజన్ వైసీపీ ఇన్‌ఛార్జ్ జేకే అల్తాఫ్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఇందుమతి ప్రత్యేక అతిథిగా హాజరై దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కార్తీక మాసం పవిత్రతను మరింత అందంగా నిలబెడుతున్న ఈ సేవా కార్యక్రమం ప్రతి ఇంటికి సానుకూల సందేశం ఇస్తుందన్నారు.
అల్తాఫ్ మత భేదాలకు అతీతంగా సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం నిజంగా ప్రశంసనీయం. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు చక్రి, మధుసూదనరెడ్డి, అల్తాఫ్ కుటుంబ సభ్యులు, ప్రాంతీయ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడి, మంగళధ్వనులతో సందడిగా మారింది. భక్తులు కూడా అల్తాఫ్ కుటుంబాన్ని అభినందిస్తూ, సమాజంలో ఇలాంటి సామరస్య కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు.

