బోయింగ్ విమానాలు నడపాలి..

కేంద్ర మంత్రి ఎంపీ కేశినేని వినతి .
ఆంధ్రప్రభ, విజయవాడ : శబరిమల యాత్రలో పాల్గొనే అయ్యప్పస్వామి భక్తుల సౌలభ్యం కోసం ఇరుముడిని విమానాల్లో క్యాబిన్ బ్యాగేజ్ గా అనుమతి ఇచ్చినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ జి.ఎం. హరీష్ రాష్ట్ర ప్రజలందరి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సోమవారం పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కార్యాలయంలో ఆయన్ను కలిసి విజయవాడ, రాజమండ్రి విమానశ్రయంలో ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. విజయవాడ -హైదరాబాద్ మధ్య డొమిస్టిక్ విమాన సర్వీసులు వున్నప్పటికీ, వాటి టిక్కెట్ ధరలు రూ.18 వేల నుంచి 20 వేల వరకు వుండటం, ఆ ధర చెల్లించి కొనేందుకు సిద్దఃమైనా సీట్లు అందుబాటులో వుండటం లేదనే సమస్యను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కి ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు.
ఆర్థిక భారానికి తోడు ఈ మార్గంలో సీట్లు అందుబాటులోకి లేకపోవటంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని వివరించారు. విజయవాడ–సింగపూర్ మధ్య అంతర్జాతీయ విమాన ప్రయాణం టిక్కెట్ ధర సుమారు రూ.7 వేలుకే లభిస్తుందని తెలిపారు. ఎ.టి.ఆర్ విమానాల్లో లగేజీ సామర్ధ్యం తక్కువగా వుండటంతో ప్రయాణీకులు లగేజీ వేరే విమానాల ద్వారా పంపించటం జరుగుతుందన్నారు.
ఇందువల్ల ముఖ్యంగా విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడటంతో పాటు, ప్రయాణీకులు సరైన సమయంలో కనెక్టివిటీ విమానాలు అందుకోలేకపోవటం, వారి కార్యక్రమాలకు ఆలస్యంగా హాజరు కావటం జరుగుతోందని తెలిపారు..కాబట్టి ప్రయాణీలకు సౌకర్యం కోసం విజయవాడ -హైదరాబాద్, రాజమండ్రి – విజయవాడ మధ్య ఎ.టి.ఆర్ విమాన సర్వీసులు కాకుండా బోయింగ్ వైడ్-బాడీ మోడల్స్ విమాన సర్వీసులు నడిపించాలని కోరారు.
విజయవాడ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు ఎక్కువగా వుండటం వల్ల ఇంటర్నేషనల్ కనెక్టీవిటి వుండే విధంగా ముంబయి, ఢిల్లీ విమానాశ్రయాలకు (ఎరైవల్, డిపార్చర్) విమాన సర్వీసులను నడపాలని కూడా కోరారు. గన్నవరం విమానాశ్రయంలో నేషనల్ టెర్మినల్ ప్రారంభం అయ్యే లోపు నేషనల్ కనెక్టీవిటి పెరిగేందుకు విజయవాడ నుంచి వారణాసి, అహ్మాదాబాద్, పుణే, కొచ్చిన్, గోవా విమాన సర్వీసులు నడిపించాలని కోరారు.
నేషనల్ కనెక్టీవిటి పెంచితే ప్రయాణీకులకు ఎంతో సౌకర్యంగా వుంటుందని వివరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ఈ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి మూడు రోజుల్లో పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలకు పెద్ద విమానాలు ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే విజయవాడ నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు పెంచటం జరిగిందని, ముంబయికి రెండు విమానాలు ఇవ్వటం జరిగిందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం తో పాటు భోగాపురం విమానాశ్రయం వేగవంతంగా నిర్మాణ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు.
