RAIN | అక్కడ జలమయం..
- నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
- తడిసి ముద్దవుతున్న ప్రజలు
- దెబ్బతింటున్న ఉద్యాన పంటలు
- నిండా మునిగిన ఆక్వా రైతులు
- సముద్రంలో చేపల వేటకు విరామంతో మత్స్యకారుల ఆవేదన
- అప్రమత్తంగా ఉన్న అధికార యంత్రాంగం
RAIN | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) నమోదు అవుతున్నాయి. జిల్లాలో 38 మండలాలు ఉండగా ప్రతి మండలంలోనూ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. సోమవారం ఉదయం నాటికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 44 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇక నెల్లూరు నగరం భారీ వర్షాలతో జల మయంగా మారింది. లోతట్టు ప్రాంతాలలో నీరు చేరుతుండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రబీ సీజన్ ప్రారంభ సమయం కావడంతో వరి నారు మడులు కుళ్ళిపోయే పరిస్థితి తలెత్తింది. ఇక ఉద్యాన పంటలైన ఆకు కూర మడులు కుళ్ళిపోతున్నాయి. పెద్దగా పంట నష్టం ఇప్పటి వరకు ఏమీ నమోదు కానప్పటికీ.. ఇవే వర్షాలు కొనసాగితే మాత్రం నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా తమలపాకు తోటలతో పాటు అరటి తోటలు ప్రమాదంలో పడ్డాయి. జిల్లాలోని అన్నీ చెరువుల్లో నీరు నిండుగా ఉండడంతో గండ్లు పడకుండా అధికారులు స్థానిక ప్రజల సహకారంతో చర్యలు తీసుకుంటున్నారు.
నిండా మునిగిన ఆక్వా రైతు..
జిల్లాలో దాదాపు 12000 హెక్టార్లలో రొయ్యలు సాగు అవుతున్నాయి. ఇప్పటికే ఆక్వా సేద్యం పలు కారణాలతో కునారిల్లుతోంది. గోరు చుట్టు మీద రోకటి పోటులా ఎడమ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఆక్వా రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాల కారణంగా ముసురు పట్టి రొయ్యలకు ఆక్సిజన్ సరిగా అందదు. డీవో( డైల్యూటెడ్ ఆక్సిజన్) సమస్యగా రైతులు (Former) పిలుచుకునే ఈ సమస్యతో రొయ్యలు చనిపోయే ప్రమాదంలో పడ్డాయి. కొన్ని చోట్ల రొయ్యలు చనిపోయి పైకి తేలుతుండడంతో రైతులు ఆయా గుంటలలో రొయ్యలను పూర్తిగా పట్టివేసి అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
సముద్రంలో వేటకు స్వస్తి..
ఉమ్మడి నెల్లూరు (Nellore) జిల్లాకు దాదాపు వంద కిలో మీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. ఆయా తీరప్రాంత గ్రామాలలో నివసిస్తున్న దాదాపు 50000 మంది మత్సకారులు సముద్రంలో చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. తుఫాను కారణంగా వారు సముద్రంలోకి వెళ్ళడాన్ని నిషేదించారు. మొంథా తుఫాను, దిత్వా తుఫాను ఇలా వరుస తుఫానులతో వేట లేక ఉపాధి తక్కువై తాము అల్లాడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సముద్ర తీరప్రాంతాలలో వాగులు, వంకల వద్దకు, పెన్నానదీ సమీప ప్రాంతాలకు విహారంగా వెళ్ళవద్దని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. మరో వైపు జిల్లా మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలు జిల్లా తుఫాను ప్రత్యేక అధికారి యువరాజ్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లలతో సమీక్షిస్తూ అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు.

