సిద్ధార్థలో టీచర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ …

- ప్రారంభించిన కృష్ణావర్సిటీ వీసీ ప్రొ. రాంజీ
విజయవాడ, ఆంధ్రప్రభ : నగరంలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా 50వ ఏపీ కాలేజి టీచర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమయింది. విజయవాడలోని దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగిన ఈ పోటీల ప్రారంభకార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వీరభద్రరావు, సిద్ధార్థ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. మేకా రమేశ్, డా. పద్మజ, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రెండవరోజు ఆదివారం పోటీలు, బహుమతి ప్రదానోత్సవం పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతాయి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అనుబంధ వైద్య, దంత, ఫార్మా, ఇంజనీరింగ్, వ్యవసాయ, న్యాయ, శారీరక విద్య, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల బోధనా సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.
పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, వెటరన్ డబుల్స్ (45-55 సంవత్సరాలు), సూపర్ వెటరన్ డబుల్స్ (55 ఏళ్ళ వయసు పైబడిన వారు), మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో జరుగుతున్న పోటీల్లో గెలుపొందిన వారికి ఆదివారం సాయంత్రం బహుమతులు అందజేస్తారు. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ నాకౌట్ కమ్ లీగ్ విధానంలో, ఇతర మ్యాచ్లు నాకౌట్ ప్రాతిపదికన నిర్వహిస్తున్నట్లు క్రీడా విభాగాధిపతి డా. టి.వి.బి. కృష్ణారెడ్డి తెలిపారు.
