Vijayawada | భవానీ దీక్ష విరమణకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

Vijayawada | భవానీ దీక్ష విరమణకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

  • పూర్తి భద్రతతో దర్శనం
  • భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ
  • ప‌రిశుభ్రంగా దీక్షలు విరమించే ప్రాంతం
  • ప్రత్యేక ప్రసాదాల కౌంటర్ల ఏర్పాటు
  • దుర్గగుడి అధికారుల సమీక్షలో ఈవో శీనా నాయక్

Vijayawada | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న భవానీ దీక్ష విరమణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ ఏర్పాట్లపై ఆలయ ఉద్యోగులతో ఈ రోజు మహా మండపం నాలుగో అంతస్థులో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఈవో నిర్వహించారు. భవానీ (Bavani) భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు దర్శనం దీక్షల విరమణ ప్రాంతం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ కౌంటర్లు, తలనీలాలు సమర్పించే ప్రాంతం కీలకమైన విషయాలపై అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు డిసెంబర్ 11 ఉదయం 8 గంట‌లకు ప్రారంభమై 15వ తేదీ ఉదయం 10-30 గంటలకు మహా పూర్ణాహుతితో ముగుస్తాయని, సుమారు ఏడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రతిష్టాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షిణలు త‌దిత‌ర ప్రధాన క్రతువులు జరుగుతాయని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, వేచి ఉండే హాళ్లు, పార్కింగ్ స్థలాలు, ప్రసాదం, అన్నదానం పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు (arrangement) ప్రణాళికలు పోలీస్ అధికారులతో కలిసి సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. భవానీ దీక్షల విరమణ కారణంగా డిసెంబర్ 11 నుంచి 16 వరకు అన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసి, ఏకాంతంగా నిర్వహిస్తారని ప్రకటించారు. భవానీ దీక్ష విరమణలో భాగంగా మూడు హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

గత సంవత్సరం 18 లక్షల ప్రసాదాలు సిద్ధం చేయగా, ఈసారి సుమారు 30 లక్షల ప్రసాదాలు తయారు చేస్తున్న‌ట్లు చెప్పారు. బస్, రైల్వే స్టేషన్లతో (Railway station) కలిపి మొత్తం 19 ప్రసాద విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. దీక్ష విరమణలో అతి ముఖ్యమైన తలనీలాల సమర్పణ కోసం కేశఖండన శాలను ఏర్పాటు చేసి ఈ సేవలకు 950 మంది క్షురకులు (బార్బర్లు) అందుబాటులో ఉంటారని, ఈసారి ధోభీ ఘాట్ అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గురు భవానీలతో పాటు విధుల్లో ఉండే సిబ్బందికి, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చే సిబ్బందికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు జారీ చేస్తామన్నారు. దీక్ష విరమణలో అతి ముఖ్యమైన గిరి ప్రదక్షణలో 9 కిలోమీటర్ల మార్గంలో భక్తులకు మార్గదర్శనం కోసం సరైన ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

దీక్షలు ప్రారంభం కావడానికి ముందే అన్నదానం (almsgiving) మెనూ బోర్డును ప్రదర్శించాలని, ఇంజనీరింగ్ విభాగం చేపట్టాల్సిన అన్ని పనులు పండుగకు ఒక వారం ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. చేసిన పనులన్నింటినీ ఒక మ్యాప్‌లో ప్రదర్శించాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3వేల‌ మందికి పైగా పోలీసులు, 300కు పైగా సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం దర్శనం, ప్రసాదం కౌంటర్లు, గిరి ప్రదక్షిణ మార్గం వివరాలతో కూడిన ‘ భవాని దీక్ష 2025’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

Leave a Reply