Nutrition industry | కుప్పంలో భారీ పెట్టుబడితో పోషకాహార పరిశ్రమ

Nutrition industry | కుప్పంలో భారీ పెట్టుబడితో పోషకాహార పరిశ్రమ
- రూ. 305 కోట్లతో ఏఎస్ ఇంటర్నేషనల్ ఒప్పందం
- పాడి రైతులకు గిట్ట్బాటు ధరతో ఆర్థిక స్వావలంభన
- యువతకు ఉద్యోగాలతో నిరుద్యోగం మాయం
- చంద్రబాబు దూరదృష్టితో కుప్పం అభివృద్ధిలో నూతన శకం
Nutrition industry | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పథంలో మరో చారిత్రాత్మక మైలురాయి చేరింది. సరిహద్దు ప్రాంతంగా గుర్తింపు పొందినా, గత దశాబ్దాలుగా అభివృద్ధి పరంగా వెనకబడిన కుప్పం, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి మార్గంలో దూసుకుపోతోంది. పాల పదార్థాలు, పోషకాహార ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా పేరొందిన ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ కుప్పంలో రూ. 305 కోట్ల భారీ పెట్టుబడితో ఒక విస్తారమైన పోషకాహార, పాల ఉత్పత్తుల సముదాయాన్ని స్థాపించేందుకు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశించింది.
ఈ పరిశ్రమతో మధ్యవర్తుల ఇబ్బందులు తగ్గి, రైతులకు సరైన మద్దతు ధర అందుతుంది. పాలకు గిట్టుబాటు ధరలో రైతుల నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. మహిళా రైతుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఈ సంస్థ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో వారి ఆర్థిక స్థితిలో మార్పువస్తుంది. చంద్రబాబు నాయుడు ఎన్నాళ్లుగానో కుప్పాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కృషి చేస్తూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, రైతులకు స్థిరమైన ఆదాయం ఉండాలి అన్న భావనతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి.
కుప్పం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రత్యేక భౌగోళిక స్థానం, రవాణా సదుపాయాల విస్తరణ, ప్రతిపాదిత విమానాశ్రయం, రైల్వే మార్పులు ఈ సమస్తం కలిపి పెట్టుబడిదారులను ఆకట్టుకునే కేంద్రంగా కుప్పాన్ని నిలబెట్టాయి. సమర్థవంతమైన పాలన, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, భూమి కేటాయింపుల్లో పారదర్శకత, నీరు, విద్యుత్ వసతుల అందుబాటు, వేగవంతమైన అనుమతులు ఇవి అన్నీ మాకు కుప్పాన్ని ఆకర్షించాయని ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలోనే ప్రముఖమైన పోషకాహార, పాల ఉత్పత్తుల తయారీ సముదాయం కుప్పంలో స్థాపించడానికి ముందుకు రావడం చంద్రబాబు నాయకత్వానికి మరొక గుర్తింపు.
ఈ భారీ పెట్టుబడి వల్ల కుప్పం ప్రజలకు అనేక లాభాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తి ఇప్పటికే విస్తృతంగా సాగుతోంది. పాలమనేరు, కుప్పం, శాంతిపురం పరిసర ప్రాంతాలు పాల సేకరణకు అనువైన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ సేకరణ కేంద్రాలు గ్రామాల వరకూ విస్తరించడంతో రైతులకు నేరుగా కొనుగోలు జరుగుతుంది. మధ్యవర్తుల ఇబ్బందులు తగ్గి, రైతులకు సరైన ధర అందుతుంది.
పాల ధరలో స్థిరత్వం రావడంతో రైతుల నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మహిళా రైతుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి సంస్థ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త అధ్యాయం. యువతకు లభించే ఉద్యోగ అవకాశాలు ఈ పెట్టుబడిలో అత్యంత ముఖ్యమైన అంశం. పరిశ్రమ పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత కుప్పం, పలమనేరు వంటి ప్రాంతాల యువతకు వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. యంత్రాల నిర్వహణ, ప్యాకేజింగ్, పాల పరీక్ష, నాణ్యత నియంత్రణ, కార్యాలయ పనులు, రవాణా, శీతలీకరణ కేంద్రాలు ప్రతి దిశలో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి.
గ్రామీణ యువతకు ఒక కొత్త జీవన మార్గం తెరుచుకుంటుంది. అదే సమయంలో పరోక్షంగా మోటారువాహనాలు, రవాణా సంస్థలు, చిన్న పరిశ్రమలు, కూల్స్టోరేజ్ కేంద్రాలు, ప్యాకేజింగ్ సామగ్రి తయారీ యూనిట్లు వంటి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉత్పత్తి విభాగం విస్తృతమైనది. శిశు పోషకాహారం, పెద్దల పోషకాహారం, పాల పొడి, నెయ్యి, వెన్న కొవ్వులు, ప్రోటీను ప్రధాన పదార్థాలు, ప్రత్యేక ఆహార తయారీకై అవసరమైన ఇతర పోషక పదార్థాలు—ఇవన్నీ ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి చేయబడతాయి.
దేశంలోని అనేక రాష్ట్రాలకు ఈ ఉత్పత్తులు పంపబడడమే కాకుండా విదేశాలకు కూడా సరఫరా చేయబడతాయి. కుప్పంలో ఈ యూనిట్ ఏర్పడిన తర్వాత విదేశీ మార్కెట్ల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కుప్పం పేరు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా వినిపించే సమయం దగ్గరపడుతోంది. కుప్పం అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో చిన్న రహదారులు మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు విశాల రహదారులు, సరిహద్దు రాష్ట్రాలకు అనుసంధాన మార్గాలు, విద్యా సంస్థలు, నిపుణుల శిక్షణ కేంద్రాలు, ఐటి కేంద్రాల ప్రతిపాదనలు ఇతర ఎన్నో ప్రణాళికలు అమలులో ఉన్నాయి.
అభివృద్ధి అంటే ప్రతి ఇంటికీ చేరాలనే ఆయన సూత్రం ఈ పెట్టుబడి ద్వారా మరోసారి రుజువైంది. ఈ భారీ పెట్టుబడితో కుప్పం ప్రాంతం అభివృద్ధి కొత్త దిశలోకి ప్రవేశిస్తుంది. రైతులకు నేరుగా కొనుగోలు, సరైన ధర, నెలవారీ స్థిర ఆదాయం లభిస్తుంది. వేలాది స్థానిక యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి. అనుబంధ పరిశ్రమల అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థబలపడుతుంది. 305 కోట్ల రూపాయల పెట్టుబడి ఒక పరిశ్రమ కోసం మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతానికి కొత్త శక్తిని ఇస్తుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిశ్రమ పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత కుప్పం పేరు రాష్ట్ర పారిశ్రామిక మ్యాపులో ఒక ప్రత్యేక స్థానం సంపాదించడం ఖాయం. స్థానిక ప్రజలు కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కుప్పం భవిష్యత్తును మార్చుతున్నాయని స్పష్టంగా చెబుతున్నారు. పరిశ్రమల రాకతో కుప్పంలో జీవనశైలి మారుతుంది, రైతుల ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి, మహిళలకు అవకాశాలు పెరుగుతాయి అన్నింటికంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నాళ్లుగానో ఊహించిన అభివృద్ధి స్వప్నం ఇప్పుడు సాకారం అవుతోంది. ఈ పెట్టుబడి కుప్పం ప్రజల భవిష్యత్తుకు ఒక మహోన్నత శుభారంభం.
