SPSR Nellore | నెల్లూరుకు న్యాయం ఏదీ..!

SPSR Nellore | నెల్లూరుకు న్యాయం ఏదీ..!

  • జిల్లాల పునర్వ్యవస్థీకరణలో సింహపురికి అన్యాయం
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల్లో అసంతృప్తి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం పట్ల అందరూ అసంతృప్తి వ్యక్తం చేసారు. అలాగే కందుకూరును నెల్లూరు జిల్లాలో అంతర్భాగం చేయడం పట్ల కూడా ఆ ప్రాంతంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. తాము అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని నాడు మాట ఇచ్చిన చంద్రబాబు.. కందుకూరు విషయంలో మాట నిలబెట్టుకుని గూడూరు విషయంలో మాట తప్పారు.

దీంతో పాటు ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి ప్రత్యేకంగా తీసుకు వెళ్ళి నెల్లూరు జిల్లాలోనే ఉంచిన రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను ప్రస్తుత ప్రభుత్వం తిరుపతి జిల్లాలో కలపాలన్న నిర్ణయం పై కూడా ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో సముచిత నిర్ణయం తీసుకుని నెల్లూరు జిల్లాకు న్యాయం చేయాలని, ప్రజా ప్రతినిధులు అందుకు గట్టిగా కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరడం జరుగుతోంది.

నెల్లూరు, ప్రతినిధి (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. అటు నాగరికత పరంగా ఇటు రాజకీయ పరంగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ.. ఇటు నవ్యాంధ్రలోనూ నెల్లూరుదెప్పుడూ ప్రత్యేక స్థానమే. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జిల్లాల విభజనపై దృష్టి సారించలేదు.

అటు తెలంగాణాలో మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ తరహాలో జిల్లాల విభజన జరిగితేనే వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధించవచ్చునని విశ్వసించి నవ్యాంధ్రలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అనుగుణంగా ఈ విభజన జరిగింది.

ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కూడా మార్పులకు లోనైంది. పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అనుసరించి నెల్లూరు పార్లమెంట్‌లో ఉన్న కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపారు. అలాగే తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో ఉన్న సర్వేపల్లిని, గూడూరును, సూళ్లూరుపేటను, వెంకటగిరిని కూడా నెల్లూరు జిల్లా నుంచి తొలగించి నూతనంగా ఏర్పాటైన బాలాజీ (తిరుపతి) జిల్లాలో కలిపారు.

అయితే నాటి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక కృషితో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరులోనే ఉంచడం జరిగింది. అలాగే నాడు వెంకటగిరి ఎమ్మెల్యే, నేడు మంత్రి అయిన ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేకంగా జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచే విధంగా ఒప్పించి నెల్లూరు జిల్లాలోనే ఆ మండలాలు ఉండేటట్లుగా చూశారు.

కండలేరు రిజర్వాయర్‌తో పాటు ప్రసిద్ధి చెందిన పెంచలకోన నరసింహస్వామి క్షేత్రం కూడా నెల్లూరు జిల్లాలోనే ఉండడం, జల వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ విధంగా కృషి చేసి సాధించడం జరిగింది. అయితే సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు తిరుపతి జిల్లాలో ఉండేందుకే ఇష్టపడ్డారు.

గూడూరు నియోజకవర్గ ప్రజలు మాత్రం నెల్లూరు జిల్లాలో ఉండేందుకు ఇష్టపడినా.. గట్టిగా కృషి చేసే నాయకుడు లేకపోవడంతో గూడూరు, తిరుపతి జిల్లాలో కలిసిపోయింది. అలాగే నెల్లూరు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న కందుకూరు నియోజకవర్గ ప్రజలు తమకు ప్రకాశం జిల్లాలో ఉండడమే ఇష్టమని కోరుకున్నప్పటికీ నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు అసంతృప్తితోనే నూతన జిల్లాలతో కాపురం చేస్తున్నారు.

గూడూరు, కందుకూరుల సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన చంద్రన్న…

కాగా.. ఎన్నికల ప్రచారంలో జిల్లాకు వచ్చిన సమయంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల విభజన అసంబద్దంగా జరిగిందని, తాము అధికారంలోకి వస్తే గూడూరు నెల్లూరులోకి, కందుకూరును ప్రకాశంలోకి కలుపుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం అందుకు సంబంధించి వివరాలను వెల్లడించింది.

ఈ వివరాల ప్రకారం కందుకూరు నియోజకవర్గం తమకు దగ్గరగా ఉన్న ఒంగోలు జిల్లా కేంద్రమైన ప్రకాశం జిల్లాలో కలవనుంది. అయితే నెల్లూరు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న గూడూరు నియోజకవర్గం మాత్రం తిరుపతి జిల్లాలోనే కొనసాగనుంది. దీంతో ఆ ప్రాంతంలో అసంతృప్తి నెలకొంటుంది.

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్న వారు.. కందుకూరు విషయంలో జిల్లా కేంద్రానికి దగ్గర అన్న సూత్రం.. గూడూరు విషయంలో ఎందుకు వర్తించదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ కూడా బహిరంగంగా కాకపోయినా తన అసంతృప్తిని, నెల్లూరు జిల్లాలోనే గూడూరును ఉంచాల్సిన ఆవశ్యకతను కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారు.

ఈ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని ప్రజల కోరికను మన్నించి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఆయనతో పాటు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా మెజార్టీ భాగం కోరుతున్నారు.

మూడు మండలాల విషయంలో.. ఆనం కృషి బూడిదలో పోసిన పన్నీరేనా..?

ఇక వెంకటగిరి నియోజకవర్గంలో భాగమైన రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నాడు తిరుపతి జిల్లాలో కలిపారు. అయితే అప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆ మండలాల విషయమై ప్రత్యేకంగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి ఆ మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండాల్సిన ఆవశ్యకత గురించి వివరించి ఆ మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండేలా చూశారు.

సోమశిల రిజర్వాయర్‌ అనుబంధంగా ఉన్న కండలేరు రిజర్వాయర్‌ ఈ మండలాల్లో ఉండడంతో పాటు అటవీ సమస్యలు, నీటి విషయంలో నిర్ణయాలపై ఆయన చక్కగా వివరించి ఆ మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండేలా చూడడం జరిగింది. దీంతో ఎంతో పేరు పొందిన పుణ్యక్షేత్రమైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కూడా నెల్లూరు జిల్లాలోనే ఉండడంతో జిల్లా ప్రజలు ఆనందపరవశులయ్యారు. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పై మూడు మండలాలు గూడూరు డివిజన్‌లో భాగమై తిరుపతి జిల్లాలో కలవనున్నాయి.

దీంతో ఆయా మండలాల్లో కూడా అసంతృప్తి చెలరేగుతుంది. ఆయా మండలాల ప్రజలు సంబంధ బాంధవ్యాల దృష్ట్యా నెల్లూరు జిల్లాతో ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఏదైనా సమస్య వస్తే వారికి నెల్లూరు రావడం సులువు. ఉదాహరణకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం ప్రకారం తీసుకుంటే ఏదైనా భూ సమస్య వస్తే వారు గూడూరు డివిజన్‌కు వచ్చి అక్కడ పరిష్కారం కాకపోతే తిరుపతి జిల్లా కేంద్రానికి అంటే దాదాపు 100 కి.మీలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆ మూడు మండలాలను గూడూరు డివిజన్‌లో కలిపినా పర్వాలేదు కానీ గూడూరు నియోజకవర్గంతో పాటు తమ మూడు మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలపాలని వారు కోరడం జరుగుతోంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు పూర్తి స్థాయిలో ప్రకటన చేయనందున ప్రస్తుతం ముసాయిదా రూపంలోనే ఉన్నందున జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి జిల్లాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నారు.

కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిపినా తమకు అభ్యంతరం లేదని, గూడూరు నియోజకవర్గంతో పాటు సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు కూడా ప్రజాభీష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నెల్లూరు జిల్లా ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారు.

Leave a Reply