Mann Ki Baat | ఒక్క రోజైనా సైంటిస్టులా ఉండండి – ప్రజలకు ప్రధాని పిలుపు
న్యూ ఢిల్లీ – ఏఐ రంగంలో భారత్ చాలా వేగంగా పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. భారత దేశం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఏఐ లో ఉంది అని మోదీ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రతిసారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చాలా కీలకమైన అంశాలపై తన మనసులో మాటను దేశ ప్రజలకు ఆల్ ఇండియా రేడియో ద్వారా చెబుతున్నారు..తాజాగా నేడు ప్రసారమైన 119వ ఎపిసోడ్లో కొన్ని అంశాలను స్పృశించారు. ముఖ్యంగా.. ఇస్రో సాధించిన విజయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహిళా సాధికారత వంటి అంశాలను ఈ ఎపిసోడ్లో హైలెట్ చేశారు
ఇస్రో వంద రాకెట్ల ద్వారా శాటిలైట్లను విజయవంతంగా నింగిలోకి పంపిందన్న ప్రధాని మోదీ.. దేశ ప్రజలు సైన్స్ పట్ల ఆసక్తి చూపించాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సైంటిస్టులా ఉండాలని కోరారు. అలాగే సైన్స్ కేంద్రాలకు వెళ్లి పరిశోధనలు చెయ్యాలని సూచించారు.
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నడుస్తోందన్న ప్రధాని మోదీ.. తాను ఇవాళ క్రికెట్ గురించి కాకుండా.. సైన్స్ గురించి మాట్లాడుతున్నానని అన్నారు. ఇస్రో వరుస విజయాలతో దూసుకెళ్తోందన్న మోదీ.. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య L-1, ఒకేసారి 104 శాటిలైట్లను నింగిలోకి పంపడం వంటివి ఇస్రో విజయాల్లో కొన్ని అని మోదీ గుర్తు చేశారు.