AP | వీడిన మిస్టరీ.. రూ.5 కోట్ల బంగారం దోపిడీ కేసు..
- అసలు నిందితుడు.. ఇంటి దొంగే..?
- పక్కా స్కెచ్..
- తోడుదొంగలు.. ఆ నలుగురే..!
- ఆరు రోజుల్లోనే.. తేల్చేసిన పోలీసులు.
- దోపిడీ బంగారం స్వాధీనం
మంగళగిరి (గుంటూరు), ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన రూ.ఐదు కోట్ల విలువైన బంగారం ఆభరణాల దోపిడీ కేసును మంగళగిరి రూరల్ పోలీసులు చేదించారు. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే అసలు దొంగలను పట్టేశారు. ఈ భారీ చోరీ కేసులో అసలు నిందితుడు.. ఇంటి దొంగేనని పోలీసులు నిర్ధారించారు. ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దుర్బుద్ధితో కాజేసేందుకు ఇంటి దొంగ అయిన దివి నాగరాజు పక్కా స్కెచ్ వేశాడు. ఇతను నలుగురు తోడుదొంగల సాయం తీసుకున్నాడు. రూ. ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను.. మొఖం కనబడనీయకుండా హెల్మెట్లు ధరించి బైక్ పై వచ్చి మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు అండర్పాస్ వద్ద తన వద్ద ఉన్న బ్యాగులు లాక్కుని పారిపోయారని దొంగ నాటకాలు ఆడాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి నమ్మిద్దామని ప్లాన్ వేశాడు. తనకు దగ్గర బంధువు, షాప్ యజమాని అయిన దివి రామును మాయమాటలతో నమ్మించి బురిడీ కొట్టించాడు. అయితే దొంగలను ఇట్టే కనిపెట్టేస్తున్న పోలీసుల ముందు ఇంటి దొంగ నాటకాలు సాగలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అసలు దొంగలను కనిపెట్టేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఈనెల 15న.. రూ.ఐదు కోట్లు బంగారం ఆభరణాలు దోపిడి..
ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈనెల 15వ తేదీ జరిగిన అయిదు కిలోల బంగారం చోరీ కేసును పోలీసులు ఆరు రోజుల వ్యవధిలో ఛేదించారు.
మంగళగిరికి చెందిన దివి రాము విజయవాడలో డీవీఆర్ జ్యుయలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో మేనేజర్ గా పనిచేసే దివి నాగరాజు షాప్ యజమాని దివి రాముకు అన్న కుమారుడు అవుతాడు. 15 వతేది రాత్రి సుమారు రూ.5కోట్ల విలువైన బంగారు ఆభరణాలను నాగరాజుకు ఇచ్చి మంగళగిరిలోని తన ఇంటిలో ఇవ్వమని తెలిపారు. అయితే సంచిలో పెట్టుకుని స్కూటీపై వస్తుండగా ఆత్మ కూరు బైపాస్ లోని అండర్ పాస్ వద్ద గుర్తుతెలియని ఇద్దరు యువకులు స్కూటీకి తగిలించిన సంచి లాక్కుని పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
అయితే అతని మాటలను పోలీసులు నమ్మలేదు. ఆ ప్రాంతంలో వివిధ వ్యక్తులను, షాపుల యజమానులను, సీసీ ఫుటేజ్ లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ మురళీకృష్ణ సీఐ వై శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ సిబ్బందితో కలిసి హుటాహుటిన దోపిడీ జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారించారు. అక్కడ సీసీ ఫుటేజ్ లో కానీ, విచారణలో కానీ బంగారం ఆభరణాల చోరీ జరగలేదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. వెంటనే దివి నాగరాజు వద్దనున్న ఫోను పోలీసులు స్వాధీనం చేసుకొని, గత కొన్ని రోజులుగా నాగరాజు ఎవరెవరితో మాట్లాడాడు, దోపిడీ జరిగిన సమయంలో ఎవరెవరికి ఫోను చేశాడు, అన్నది కూపీ లాగారు. ఆ రోజే షాపులో పనిచేస్తున్న భరత్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని నాగరాజుతో పాటు అదుపులోనికి తీసుకొని విచారించారు.
నలుగురు తోడు దొంగలతో.. పక్కా స్కెచ్..!
పోలీస్ వారు అనుమానించినట్లే నాగరాజు స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేసి జ్యువెలరీ షాపు యజమాని దివి రాము ఇచ్చిన ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును, నాగరాజే నలుగురు తోడు దొంగలైన స్నేహితులతో కలసి ఈ దోపిడీ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఆర్థిక ఇబ్బందులతోనే ఈ దోపిడీ..!
తన ఆర్థిక ఇబ్బందులు వల్లనే ఐదు కోట్లు విలువైన బంగారు ఆభరణాలు దోపిడీ చేసినట్లు పోలీసుల విచారణలో నాగరాజు వెల్లడించినట్లు నిర్ధారణ అయింది. అయితే ఇక్కడ షాపు యజమాని దగ్గర బంధువు దివి రాముకు రూ.5కోట్ల నష్టం వచ్చినా పర్లేదు అనుకున్నాడో ఏమో..? తాను మాత్రం ఐదు కోట్లు విలువైన బంగారం కాజేద్దామని నలుగురు స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేసి పోలీసుల ముందు, చట్టం ముందు దోషిగా దొరికిపోయాడు. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, చెల్లికి వివాహం చెయ్యాలని తన స్నేహితులైన నవీన్, లోకేష్, భరత్, సాయి అనే నలుగురు యువకులను నమ్మించి ఈ చోరీ కథ నడిపించాడు. ఆభరణాలు చోరీ చేసేందుకు తనకు సహకరిం చాలని స్నేహితులను కోరాడు. మొదట వారు పోలీసులకు భయపడి నిరాకరించారు. దీంతో నాగరాజు మీకేం ఇబ్బంది లేదని, అసలు కేసు లేకుండా చూసుకుంటానని ఒప్పించాడు అనేది సమాచారం.
దోపిడీలో భరత్ కీలకం..!
ఈ దోపిడీ వ్యవహారంలో డీవీఆర్ జ్యువెలరీ షాప్ లో పనిచేస్తున్న భరత్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు జ్యువెలరీ షాపులో పనిచేస్తున్న భరత్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించారు. రూ.ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును తానే దివి నాగరాజు భుజానికి తగిలించానని భరత్ పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేసినప్పుడు స్కూటీ ముందు భాగంలో ఆభరణాల బ్యాగును భరత్ పెట్టాడని, గుర్తు తెలియని ఆగంతకులు స్కూటీపై వచ్చి తన దగ్గర ఉన్న ఆభరణాల బ్యాగును లాక్కుని పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఐదుగురు కూడా ఒకరితో ఒకరికి మాటలతో పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో పోలీసులు నిర్ధారణకు వచ్చి అసలు దొంగల నిగ్గుతేల్చారు.
దోపిడీ చేసిన రూ.ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును స్థానికంగా నివాసం ఉండే లోకేష్ అనే వ్యక్తి ఇంట్లో దాచి ఉంచారు. పోలీసులు ఆ బంగారు ఆభరణాల బ్యాగు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ఆభరణాలు దోపిడీ చేసి కథను రక్తి కట్టించాలనుకున్న ఇంటి దొంగ దివి నాగరాజు, అతనితో పాటు తోడుదొంగలైన నవీన్, లోకేష్, భరత్, సాయి అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. దుర్బుద్ధి వారి కొంప ముంచింది. కటకటాల పాలయ్యారు.
ఈ ఆభరణాల దోపిడీ మిస్టరీని నేరవిభాగం ఏఎస్పీ సుప్రజ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, పోలీసులు సంయుక్తంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టి.. ఆరు రోజుల వ్యవధిలోనే చోరీకి గురైన బంగారంతో పాటు నిందితులను పోలీసులు అరెస్టు చేసి పలువురి ప్రశంసలను అందుకున్నారు.