Collector | పర్యాటక హబ్‌గా ఎన్టీఆర్ జిల్లా

- తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యాచరణ
- 18.5 శాతం వార్షిక వృద్ధి రేటు లక్ష్య సాధనకు కృషి
- 563 కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై నిరంతర పర్యవేక్షణ
- ప్రజారోగ్యం, ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి
- ప్రత్యేక బృందాలతో నిరంతర క్షేత్రస్థాయి తనిఖీలు
- స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ దిశగా అన్ని శాఖల అడుగులు
- త్వరలో ఆంధ్రా ట్యాక్సీ మొబైల్ యాప్!
- ఒకే డిజిటల్ వేదికపై సమస్త పర్యాటక సమాచారం
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ లక్ష్మీశ విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకొని రెండో ఏడాదిలోకి అడుగు..
Collector | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రంలో కీలకమైన ఎన్‌టీఆర్ జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో టీమ్ ఎన్‌టీఆర్‌తో కలిసి తనదైన పనితీరుతో గుర్తింపు సాధించారు డా. జి.లక్ష్మీశ. జిల్లాలో సేవారంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలున్న నేపథ్యంలో జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా టూరిజం ప్యాకేజీల వివరాలతో త్వరలో ఆంధ్రా ట్యాక్సీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నారు. జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో, హిస్టారికల్ పర్యాటకానికి కూడా మంచి అవకాశాలున్నాయి. కొంత మంది యువతీయువకులను గుర్తించి గైడ్లుగా శిక్షణ కూడా ఇచ్చారు. వివిధ పర్యాటక ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా, మరుగుదొడ్లు, రహదారులు వంటి ప్రాథమిక మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నారు. పర్యాటకులకు ఆంధ్రా ట్యాక్సీ యాప్ ఏకీకృత వేదికగా సేవలందించనుంది. కొత్త ఏడాదికి కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కూడా అందుబాటులోకి వస్తుంది. యోగాంధ్రలోనూ ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సారథ్యంలో రెండు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు సాధించి యోగాంధ్ర స్ఫూర్తిని దశదిశలా వ్యాపింపజేశారు.
సుస్థిర ఆర్థిక వృద్ధి దిశగా..
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు చేస్తున్న కృషిలో భాగంగా 18.5 శాతం ఆర్థిక వృద్ధికి కృషిచేస్తున్నారు. తలసరి ఆదాయంతో పాటు జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ప్రగతికి సమగ్ర కార్యాచరణతో పనిచేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 563 కీలక ప్రగతి సూచికల్లో (కేపీఐ) అభివృద్ధికి కృషిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు రానుంది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులకు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎంఎంస్ఎంఈ పార్కుకు శంకుస్థాపనలు జరిగాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వీటి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చొరవ చూపుతున్నారు. జిల్లాలో హరిత విస్తీర్ణాన్ని పెంచేందుకు గ్రామం యూనిట్‌గా లక్ష్యాలను నిర్దేశించి.. 25 శాతం ఉన్న హరిత విస్తీర్ణాన్ని దశల వారీగా 33 శాతానికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా మరో పది మందికి ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ సంఘాల్లోని ఫ్యాషన్ డిజైనర్ల ఉత్పత్తులతో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసేందుకు చొరవచూపుతున్నారు.
ఆరోగ్యానికి, ప్రజా భద్రతకు పెద్దపీట..
ప్రజల ఆరోగ్యానికి, ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలో అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నారు. ఎ.కొండూరు ప్రజల చిరకాల వాంఛ అయిన పూర్తిస్థాయిలో కృష్ణాజలాలను కొత్త సంవత్సరంలో పంపిణీకి పూర్తి సన్నద్ధంగా ఉన్నారు. కిడ్నీ వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ జల్‌జీవన్ మిషన్ ప్రాజెక్టు ఎంతో సహకరించనుంది. వ్యాధి నిర్ధారణ సేవలతో పాటు డయాలసిస్ సేవలపైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేక అధికారుల బృందాలతో నిరంతరం హాస్టళ్లను తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజా భద్రతా చర్యల్లో భాగంగా ఆలయాలతో పాటు సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు తదితరాలను ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
కొత్త ఆవిష్కరణలకు ఆర్‌టీఐహెచ్ చేయూత…
యువతరం కొత్త ఆలోచనలను పరిశ్రమల స్థాపన దిశగా నడిపించేందుకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) చేయూతనందిస్తోంది. ఇంక్యుబేషన్, ఆర్థిక మద్దతు, శిక్షణ, మార్కెటింగ్ ఇలా వివిధ అంశాల్లో ఎనికేపాడులోని ఆర్‌టీఐహెచ్ హబ్ స్పోక్ ఇందుకు సహాయసహకారాలు అందిస్తోంది. ఈ స్పోక్ కార్యకలాపాలపై కలెక్టర్ లక్ష్మీశ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
