Sakthi Scheme | ఆర్టీసీ బస్సులలో పురుషులకూ సీట్ల రిజర్వేషన్
బెంగళూరు – ఉచిత బస్సు పథకం అమలు చేస్తుండటంతో మెట్రో, బస్సుల్లో ప్రయాణించే సమయంలో మహిళలకు రిజర్వు చేసిన సీట్లలో పురుషులు కూర్చుంటే వారికి జరిమానాలుసైతం విధిస్తున్న పరిస్థితి. దీనికితోడు ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు కేటాయించిన సీట్లలోనూ చాలా సందర్భాల్లో పురుషులు కూర్చునే పరిస్థితి ఉండదు. దీంతో పురుషులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే చాలావరకు నిలబడి ప్రయాణించాల్సి వస్తుంది. దీనికితోడు.. ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో ఏ బస్సు చూసినా మహిళలతో నిండి ఉంటుంది. దీంతో ఓ వ్యక్తి ఫిర్యాదుతో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వివరాలలోకి వెళితే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ‘శక్తి’ పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే, కర్ణాటకలో శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత బస్సుల్లో సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తున్నారట. బస్సుల్లో మహిళలకు రిజర్వు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికితోడు మిగిలిన జనరల్ సీట్లనుసైతం మహిళలే ఆక్రమిస్తున్నారట. దీంతో పురుషులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే నిలబడి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో రోజూ సిటీ బస్సులో ప్రయాణించే విష్ణువర్దన్ అధికారులకు ఈ విషయంపై లేఖ రాశాడు.
చట్టసభ సభ్యులు, దివ్యాంగులు, స్వాతంత్ర్య సమరయోధులు, మహిళలకు మాత్రమే సీట్లు రిజర్వు చేశారు.. బస్సులలో పురుషులకు ఎందుకు కేటాయించడం లేదని కేరళ ప్రభుత్వానికి, కేఎస్ఆర్టీసీ అధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీనిపై అధికారులు స్పందించారు. పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీట్లను కేటాయించారు. మైసూరు విభాగం నుంచి రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల్లో దశల వారిగా పురుషులకు సీట్లు కేటాయిస్తూ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అలాగే కర్నాటకలోని అన్ని డిపోల నుంచి బయలుదేరే అన్ని బస్సులలో సైతం పురుషులకు త్వరలోనే సీట్లు రిజర్వ్ చేస్తామని పేర్కొన్నారు.. ఇకనుంచి పురుషులు లేనప్పుడు మాత్రమే ఆ సీట్లలో ఇతరులు కూర్చునేందుకు అవకాశం ఉంటుంది.