AP | ఉచితాలతో.. అభివృద్ది ఎలా..?

AP | ఉచితాలతో.. అభివృద్ది ఎలా..?

  • మనకు సాగుతోందిగా…
  • ఉచితాలు మానుకుందామా!
  • ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తే.. అద్భుతాలే..
  • ఉచిత పథకాలకంటే.. అభివృద్ధి ముఖ్యమని గుర్తించాలి..
  • 6 వేల కోట్లు వెచ్చిస్తే..6.50 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి..
  • ఉచితాలతో వెంటాడుతున్న నిధుల కొరత..
  • ఫలితంగా ఏళ్ల తరబడి.. సాగుతున్న ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు..
  • కొందరిలోనైనా మార్పు రావాలి..
  • పేదల్లోనే ధనికవర్గాలు పునరాలోచన చేయాలి..
  • రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గేలా చూడాలి..
  • సంక్షేమ పథకాల జాబితా నుంచి.. ధనికవర్గాలు తప్పుకోవాలి..
  • అందుకు స్వచ్ఛందంగా వారు ముందుకు రావాలి..
  • ఆ నిధులను ఇతర ప్రాజెక్టులకు వెచ్చించొచ్చు..
  • పేదల్లోని ధనికవర్గాలకు.. ఆర్థిక నిపుణుల సూచన..

AP, అమరావతి, (ఆంధ్రప్రభ బ్యూరో) : రాష్ట్రంలోని అత్యధిక మంది ప్రజలు ఉచిత పథకాల పట్ల చూపుతున్న ఆసక్తి అభివృద్ధి వైపు చూపలేకపోతున్నారు. పేదలతో పాటు కొంతమంది ధనిక వర్గాలు కూడా ఉచితాలకు అలవాటు పడిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా కీలకమైన ప్రాజెక్టులను ఆయా ప్రాంతాల అభివృద్ధిని వదిలి ఉచిత పథకాలకే ఎక్కువ నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పడి ఉంటున్నాయి. కేవలం రూ.6 వేల కోట్లు వెచ్చిస్తే 6.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి ఆయా ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేకపోవడంతో లక్షలాది ఎకరాలు బీడులుగానే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నాయి. అందుకోసం ప్రతి ఏటా బడ్జెట్‌లో 60 శాతం పైగా నిధులు ఉచిత పథకాలకే ఖర్చుచేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి.

గడచిన ఆరేడు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉచిత పథకాల సంఖ్య మరింత పెరిగింది. నాటి వైసీపీ (YCP) ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకు ఉచిత పథకాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అర్హులైన నిరుపేదలకు వివిధ పథకాల ద్వారా ఉచితంగా ఆర్థిక ప్రయోజనాలు అందించటంలో తప్పులేదు. అయితే ప్రతి పథకాన్ని ఉచితంగా అందించటం ప్రతి ఏటా అర్హుల జాబితా పెంచుకుంటూ పోతుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది. సంక్షేమం, ఉచిత పథకాలకు అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తుండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆశించిన స్థాయిలో నిధులు అందుబాటులో ఉండటం లేదు.

ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 70 శాతంపైగా పనులు పూర్తయిన ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు 60 నుంచి 80 శాతం ఉన్నాయి. వాటికి కేవలం 6 వేల నుంచి 10 వేల కోట్లు వెచ్చిస్తే పై ప్రాజెక్టులన్నీ పూర్తయి దాదాపుగా 6.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. అలాగే ఆయా ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న గ్రామాలకు మంచినీటి వసతి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. కేవలం 6 నుంచి 10 వేల కోట్లు నిధులు ఖర్చుచేయలేక రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా సాగునీటి ప్రాజెక్టు పనులను సాగదీస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉచిత పథకాలకు ఇస్తున్న నిధుల నుంచి ఒక్క పథకానికి మినహాయింపు ఇస్తే చాలు, ఆ నిధులతోనే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశముందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో పేదల్లోని ధనికవర్గాలు ఉచిత పథకాల పట్ల పునరాలోచన చేయాలని వారు కోరుతున్నారు.

సంక్షేమ పథకాల జాబితా నుంచి.. ధనికవర్గాలు తప్పుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వం (Andhra pradesh) ఆయా పథకాల ద్వారా సుమారు కోటి మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత పథకాలను అందిస్తుంది. వాటిలో అత్యధిక శాతం ఆర్థిక ఫలాలు అందించే పథకాలే ఉన్నాయి. అయితే ఆయా పథకాలకు సంబందించి అర్హుల జాబితాలో నిజమైన పేదలతో పాటు కొంతమంది ధనిక వర్గాలు కూడా ఉన్నారు. వారంతా ప్రతినెలా 50 నుంచి లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆశించేవారే. అటువంటి వారిలో పునరాలోచన రావాలి. ఉచిత పథకాల నుంచి వారే స్వచ్ఛందంగా వైదొలగేందుకు ముందుకు రావాలి. అప్పుడే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలు అసలైన, నిజమైన పేదలకు మాత్రమే చేరుతాయి. బలవంతంగా ప్రభుత్వాలైతే అర్హుల జాబితా నుంచి ధనికవర్గాలను తొలగించే నిర్ణయాలు తీసుకోవడం సాధ్యంకాదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో పేదలకు ఉచిత పథకాలు అందిస్తామని పోటాపోటీగా హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచాక హామీలను నిలబెట్టుకోలేకపోతే తిరిగి వారు ప్రజల్లోకి వెళ్లలేరు. నాటి, నేటి ప్రభుత్వాల ఆలోచనలు కూడా అవే. అందుకే లోటు బడ్జెట్‌ అయినా లెక్కచేయకుండా ఇచ్చిన మాట ప్రకారం అర్హుల జాబితా ప్రకారం ఉచిత పథకాలను అందిస్తున్నాయి. ఫలితంగా లక్షకోట్లకు పైగా ప్రతిఏటా ఉచిత పథకాల కోసమే ప్రభుత్వం నిధులను వెచ్చించాల్సి వస్తోంది. పేదల్లోని ధనికవర్గాలు ఉచిత పథకాల నుంచి బయటకు వస్తే ఆ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

పోలవరం వంటి ప్రాజెక్టులకు నిధుల కొరతే..
ఏపీ జీవనాడి పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ వాటి పరిధిలోని ప్రధాన కాలువలు, ఉప కాలువలు, ఇతర నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సి ఉంది. దశాబ్దాలుగా పోలవరం పనులు కొనసాగుతూనే ఉన్నాయే కాని పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నేటి వరకు అందుబాటులోకి రాలేదు. పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం చేతిలో ఆశించిన స్థాయిలో నిధులు లేకపోవడం, లోటు బడ్జెట్‌, విభజన సమస్యలు ఇలా అనేక ఆర్ధిక సమస్యలతో ప్రభుత్వాలు ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలకు మాత్రం ఉచిత పథకాలను క్రమం తప్పకుండా అందిస్తూనే ఉన్నాయి. వాటిలో కేవలం 10 శాతం నిధులు ఉచిత పథకాలను కాదని, ప్రాజెక్టులకు వెచ్చిస్తే లక్షలాది ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు పెద్దఎత్తున ధాన్యం కూడా దిగుబడి అయ్యే అవకాశం ఉంది. తద్వారా రైతులు ఆయా అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి ఆర్ధిక రేఖ కూడా మరింత బలపడే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలోనే ఉచిత పథకాలు పొందుతున్న వారిలో ధనిక వర్గాలు ఆలోచన చేస్తే కొంత మేర అయినా ప్రాజెక్టు పనులకు ఆ నిధులు ఉపయోగపడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం జలవనరుల రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం పై ఆర్థిక భారాన్ని తగ్గేలా చూడాలి..
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ అనేక ఇబ్బందులతో సతమతమవుతోంది. ప్రధానంగా లోటుబడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి (Chandra babu Naidu) రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఆర్థికంగా ఏపీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగాలన్నా రాష్ట్ర ఆర్థిక రేఖ బలంగా ఉండాలన్నా మరికొంత సమయం పట్టేఅవకాశం ఉంది. అలాగే భావితరాలకు మరిన్ని వనరులను అందుబాటులోకి తీసుకురావాలంటే ఇప్పటినుండే ఒక ప్రణాళికా బద్ధంగా ఆయన ముందుకు వెళ్లాల్సి ఉంది. అందుకోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే సంక్షేమానికి ధీటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే సంకల్పం ఉన్నప్పటికీ ఆర్థికంగా నిధులు అందుబాటులో లేక అనేక పథకాలకు స్వల్ప నిధులను వెచ్చించాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలి.

ప్రభుత్వాలు తమ కోసం ఉచిత పథకాలు అందిస్తున్నప్పుడు భావితరాల కోసం పేదల్లోని ధనికులు ఉచిత పథకాలకు దూరంగా ఉండాలని నిర్ణయానికి రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆ తరహా ఆలోచన ప్రజల్లో వస్తే ఉచిత పథకాల్లోని కొంత మొత్తమైనా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే వెసులుబాటు లభిస్తుంది. ఇప్పటికే లోటుబడ్జెట్‌తో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడినప్పటికీ సీఎం చంద్రబాబు (CM Chandra babu) కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పోలవరంతో పాటు అమరావతి రాజధాని పనులను పరుగుపెట్టిస్తున్నారు. అలాగే కొత్త పరిశ్రమలను స్వాగతిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రజల నుంచి బలమైన సహకారం లభిస్తే రాష్ట్రం మరింత ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కూడా అవకాశం లభిస్తుంది. ఆ దిశగా పేదల్లోని ధనికవర్గాల్లో ఆలోచన రావాలని ఉచితాల పట్ల పునరాలోచన చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply