HANUMAN | ముమ్మరంగా అంజన్న జాతర ఏర్పాట్లు

HANUMAN | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రసిద్ధి చెందిన పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల (జాతర) ఏర్పాట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వచ్చేనెల డిసెంబర్ 2 నుండి 9వ తేదీ వరకు అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. పాలమూరు జిల్లా నుండే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు.
జాతరను పురస్కరించుకొని ఆలయ పరిసరాల్లో రామ్ లీలా మైదానం తదితర ప్రాంతాల్లో చదును చేసే పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆలయానికి పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 3న ప్రభోత్సవం, 4న అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవ వేడుకలు 5న పాలఉట్ల కార్యక్రమం జరగనుంది.
జాతర ఉత్సవాల్లో ప్రధానంగా ఈ మూడు రోజులు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇప్పటినుండే పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పి.ప్రాణేషాచారి, ఆలయ ఈవో కవిత దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
