KNL | వలసలు వెళ్లకుండా పనులు కల్పించండి.. కలెక్టర్ రంజిత్ భాషా
కర్నూలు, ఫిబ్రవరి 21: వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని, పనులు కల్పించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పథకం అమలు, హౌసింగ్ అంశాలపై ఏపీడీ లు, ఎంపీడీఓలు, ఏపీవో లు, హౌసింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాల్లో పనుల కోసం కూలీలు వలస వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ లు, సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఎలా అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ఒక వైపు వలసలు వెళుతుంటే జాతరలు, ఉత్సవాలు అని కారణాలు వెతుక్కుంటే అంగీకరించనని కలెక్టర్ హెచ్చరించారు. రోజుకు లక్ష మందికి పనులు కల్పించే లక్ష్యంతో పని చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
పనులు కల్పించడంలో సి.బెలగల్, వెల్దుర్తి, పత్తికొండ, ఎమ్మిగనూరు, దేవనకొండ, ఆదోని, తుగ్గలి, పెద్దకడబూరు, నందవరం, ఓర్వకల్లు, కౌతాళం, కోడుమూరు మండలాలు వెనుకబడ్డాయన్నారు. సంబంధిత మండలాల ఎంపిడిఓలు, ఏపివోలతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెల చివరికి వచ్చినప్పటికీ కూడా ఇంకా 60శాతం మాత్రమే పనులు కల్పించడం ఏంటని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజు వారీ, వారపు లక్ష్యాల సాధనలో వెనుకబడిన సందర్భంగా పెద్ద కడుబూరు ఎంపిడిఓ, కౌతాళం ఏపీఓ కి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డ్వామా పిడిని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి 100రోజుల పనిదినాలు కల్పించాలని చెప్పమని, అయినప్పటికీ ఈ అంశంలో వెనుకబడి ఉన్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.75 కంటే ఎక్కువ పని దినాలు కల్పించిన వారిపై దృష్టి పెట్టి, 100 రోజులు పనిదినాలు కల్పించిన వారి సంఖ్య పెరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డ్వామా పీడీ వెంకట రమణయ్య, హౌసింగ్ పీడీ అజయ్ కుమార్, మండల స్పెషల్ అధికారులు, ఎంపీడీఓ లు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.