TG | శిథిలావస్థకు చేరువలో జాతి గౌరవం..
- నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం
- రాళ్ల గుట్టల్లో విలవిలలాడుతున్న స్వతంత్ర పోరాట శిలాఫలకం
- అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్న భారత సం విధానం
TG, అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలో గొప్ప చారిత్రక గుర్తుగా నిలవాల్సిన జాతి గౌరవమైన భారత సంవిధాన శిలాఫలకం… నేడు రాళ్ల గుట్టల్లో పడి శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో, శిథిలావస్థకు చేరువలో ఉంది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, జాతి గౌరవానికి అవమానమని ప్రజలు, మేధావులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్రం (Independence) సిద్ధించిన 25 సంవత్సరాల తర్వాత నాటి స్వాతంత్ర పోరాటాన్ని భావితరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు అద్భుతమైన నిర్మాణ శైలిలో 1972 నుండి 73 సంవత్సర కాలంలో అచ్చంపేట పట్టణంలోని ఒకప్పటి మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో అత్యంత సుందరంగా ఏర్పాటుచేసిన శిలాఫలకం నేడు నిర్లక్ష్యపు నీడలో శిథిలావస్థకు చేరువలో ఉంది.
అట్టి శిలాఫలకాని చూసిన ప్రజానీకం స్వాతంత్ర పోరాటాన్ని, నాటి వారి త్యాగాలను గుర్తుకు రాగా భారతీయులందరి (Indians) గుండెలు దేశభక్తితో ఉప్పొంగిపోయేవి. నాడు గౌరవప్రదంగా, జాతీయవాదానికి ప్రతీకగా నిలిచిన ఆ శిలాఫలకం… ఇప్పుడు కర్కాశమైన రాళ్ల గుట్టల్లో విసిరేసినట్టు పడి ఉంది. రాజ్యాంగ మూల విలువలు – స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సార్వభౌమిక ప్రజాస్వామ్యం, గణతంత్రం, భావ ప్రకటన, ధర్మం, వంటి అతి ప్రాముఖ్యమైన సందేశాలు చెక్కబడి ఉన్న ఈ జ్ఞాపిక పై, కొత్త నిర్మాణ పనుల పేరుతో పునాది రాళ్లతో బొంద పెడుతున్నారు. ఇంత విలువైన జాతీయ జ్ఞాపకాన్ని కాపాడాల్సిన సమయంలో, దానిని ఇలా వదిలేయడం ఎంతటి నిర్లక్ష్యమని పలువురు మండిపడుతున్నారు.
“పనులు ఉన్నాయన్న పేరుతో శిలాఫలకాన్ని ఇలా పక్కకు తోసేయడం హేయం! ముందు దానిని గౌరవంగా సురక్షిత ప్రాంతానికి తరలించి ఉండాలి. ఇప్పుడు అర్ధం దెబ్బతిన్నా, రేపు పూర్తిగా శిథిలమైపోయినా ఎవరు బాధ్యత వహిస్తారు?” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 ఏళ్ల స్వతంత్ర భారత జ్ఞాపకంగా చెక్కిన ఈ శిలాఫలకం మీద ఉన్న పదాలు ఇప్పుడు చదవడానికి కూడా వీలులేని స్థితికి చేరువలో ఉన్నాయి. ఒక జాతి గౌరవం, ఒక దేశం చరిత్రను సూచించే చిహ్నం ఇలా రాళ్ల కింద చిక్కుకోవడం… అచ్చంపేట ప్రజలు, మేధావులు, జాతి ప్రేమికులు సహించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ శిలాఫలకాన్ని రక్షించి చరిత్రను చెరిపేసే నిర్లక్ష్యాన్ని ఆపాలని కోరుతున్నారు.


