ACB | వస్తుందనే.. ఇలా చేశారా..?

ACB | వస్తుందనే.. ఇలా చేశారా..?

  • చెత్త కుప్పలో సాక్షాత్కారమిచ్చిన దస్తావేజు లేఖరుల ఐడెంటిటీ కార్డులు
  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమీపంలోనే ఈ కార్డుల దర్శనం
  • ఎక్కడి నుండి వచ్చాయి..? దొంగచాటుగా పడేసి వెళ్ళింది ఎవరు..??
  • తమ గుట్టు రట్టు అవుతుందని తెలిసే కార్డులన్నీ ఇలా చేశారా..?
  • అంటే ఏసీబీ ముందే వస్తుందని తెలుసా..? వచ్చి వెళ్ళాక ఇలా పడేశారా..?
  • అసలేం జరిగింది..! ఈ కార్డుల పారవేతలో అసలు మతలబు ఏమిటి..?

ACB, మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇటీవల మంచిర్యాలలో (Mancherial) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు అనే విషయం ముందే లీక్ అయ్యిందా..? ఏసీబీ అధికారులు వస్తున్నారనే సమాచారం పై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏమైనా ఉప్పందిందా..? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో కుప్పలు తెప్పలుగా దస్తావేజు లేఖరు(డాక్యుమెంట్ రైటర్స్)ల ఐడెంటిటీ కార్డులు చెత్తకుప్పలో దర్శనమిచ్చినమిచ్చిన దరిమిలా పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాటి పై సందేహాలు సహజంగానే కలుగుతున్నాయి. దస్తావేజు లేఖరుల ఐడెంటిటీ కార్డులతో పాటు పలు ఫోటోలు.. చించివేసిన ఇతర కాగితాలు దర్శనమివ్వడంతో అసలు ఏం జరిగి ఉంటుంది..? అనే అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముందే వీటన్నింటినీ చెత్తకుప్పలో పడేశారా..? లేకుంటే ఏసీబీ అధికారులు వచ్చి వెళ్లాక ఈ పని చేశారా..? అనేది కూడా చర్చకు దారితీస్తోంది. కలకలం రేపుతున్న ఈ ఐడెంటి కార్డుల కహాని పై ‘ఆంధ్రప్రభ’ ప్రత్యేక కథనం…

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇటీవల ఆకస్మిక సోదాలకు వచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) ఏసీబీ డిఎస్పీ పి.మధు నేతృత్వంలో ఈనెల 14వ తేదీన ఈ సోదాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఉన్నతాధికారుల అధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితమైన సమాచారంతో ఈ సోదాలు జరిగినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగానే మంచిర్యాలలో అధికారులు ఆరోజు సాయంత్రం నుండి రాత్రి పదిన్నర గంటల వరకు సోదాలు నిర్వహించారు. అయితే.. ఈ సోదాల అనంతరం అంటే రెండు రోజుల తర్వాత మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోని చెత్త కుప్పల్లో పలువురు ప్రైవేట్ దస్తావేజు లేఖరు(డాక్యుమెంట్ రైటర్స్)ల ఐడెంటిటీ కార్డులు పడేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కార్డులు ఇక్కడ ఎందుకు పడేశారు..? దీని వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి అనేది ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.

ఎందుకని ఈ పని చేశారు..?
ప్రైవేటు దస్తావేజు లేఖరులుగా కొనసాగుతున్న కొందరి ఐడెంటిటీ కార్డులు ఇలా పడేయడంతో.. వాటిని అలా ఎందుకు పడేశారు..? అనేది అంతు పట్టడం లేదు. ఏసీబీ అధికారులు ఎవరెవరు మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో దస్తావేజు లేఖరులుగా పని చేస్తున్నారు..? ఎవరెవరు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు..? అనే కోణంలో ఆరా తీస్తున్నారని తెలిసే ఈ పని చేశారా..? లేదంటే తమ గుట్టు రట్టు అవుతుందని పసిగట్టి కార్డులను ఇలా పడేశారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు సంబంధిత కార్యాలయ సిబ్బందికి బినామీలుగా కొనసాగుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కొందరిని తీసేసిన సంగతి తెలిసిందే. అయితే వారిలో మరో ఇద్దరు మాత్రం ఇంకా రహస్యంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈ ఐడెంటిటీ కార్డులు చెత్తకుప్పలో దర్శనమిచ్చిన తీరు పై విభిన్న చర్చలు జరుగుతుండడంతో పాటు విభిన్న అనుమానాలు, అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply