- అందుబాటులోకి నూతన యాగశాల
- నిత్య హోమాలు, యాగాలు పూజలు అక్కడే..
- దాత సంఘ నరసింహారావు ఆర్థిక సహాయంతో..
- సుమారు రూ 5.50 కోట్ల రూపాయలతో నిర్మాణం
- ప్రత్యేక పూజలు చేసి అందుబాటులోకి తెచ్చిన దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ
TEMPLE | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నూతన యాగశాల అందుబాటులోకి వచ్చింది. దాత సంఘ నరసింహారావు ఆర్థిక సహాయంతో రూ 5.50 కోట్ల వ్యయంతో నిర్మించిన యాగశాలలో ఇకనుంచి అన్ని హోమాలు యాగాలు పూజలు అక్కడే నిర్వహించనున్నారు. దాత సహకారంతో అద్భుత నిర్మాణం చేయగా ఆలయ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి మరియు పాలకమండలి సభ్యుల కృషితో సహకారముతో భక్తులకు అందుబాటులోనికి రావడం జరిగినది. ఇంద్రకీలాద్రిపై అధునాతన సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన యాగాశాల గురువారం ఘనంగా ప్రారంభమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థానం ఛైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు ప్రారంభ తొలిరోజు పాల్గొని వారి చేతుల మీదుగా పూజ సామాగ్రి అందజేసి ఈ పవిత్రమైన యాగాశాలను ప్రారంభించారు.

ఈ నూతన యాగాశాల భక్తుల సౌకర్యార్థం, ఆలయ నిత్య కైంకర్యాలలో భాగంగా నిర్మించబడింది. ఈ యాగశాలలో ఇకపై ప్రతిరోజూ శ్రీ చండీ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి.నిత్య హోమాలతో పాటు ఇతర ప్రత్యేక పూర్ణాహుతి పూజలకు ఈ యాగాశాల వేదిక కానుంది. అమ్మవారికి జరిగే నవరాత్రి ఉత్సవాలు ఇతర ముఖ్యమైన పండుగ రోజులలో నిర్వహించే బృహత్తర యాగాలు, క్రతువులు అన్నీ ఈ విశాలమైన నూతన ప్రాంగణంలోనే జరుగుతాయి. ఈ బృహత్తర నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా ఒకే దాత సంఘ నరసింహారావు భరించడం విశేషం.

ఈ యాగాశాల నిర్మాణానికి సుమారు రూ. 5.50 కోట్లు ఖర్చు అయింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దాత తన సొంత నిధులతో విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ శ్రీ బి. రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి. కె. శీనా నాయక్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఇరువురూ మాట్లాడుతూ, దాత సంఘ నరసింహారావు ఉదారతను కొనియాడారు. భక్తులు ఈ నూతన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

