GOVERNMENT|చెవిరెడ్డికి సర్కార్ బిగ్ షాక్

- సిట్ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- రూ. 64 కోట్ల కుటుంబ ఆస్తులకు చెక్
GOVERNMENT|తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న తిరుపతి జిల్లాకు చెందిన వైసీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బుధవారం మరో షాక్ తగిలింది. ప్రాధమిక దర్యాప్తులో గుర్తించిన అక్రమాస్తులను జప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా భాస్కర్ రెడ్డితో పాటు ఆయన భార్య, కుమారులకు సంబంధించిన రూ. 64 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ మెంట్ కు గురికానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా, తుడా అధ్యక్షుడుగా, ప్రభుత్వ విప్ గా, టీటీడీ బోర్డు సభ్యుడుగా చక్రం తిప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు తప్పడం లేదు.
తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలకు తోడుగా రాష్ట్ర వ్యాప్త సంచలనం సృష్టించిన మద్యం స్కాం మకిలీ కూడా అంటుకుంది. ఆ స్కాంను విచారిస్తున్న సిట్ అధికారులు భారీగా ఆర్ధిక లబ్ది పొందారనే ఆరోపణలతో నాలుగు నెలలక్రితం భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. గత సెప్టెంబర్ నెలలో తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్ లలో ఆయన కుటుంబ సభ్యుల కంపెనీలపై దాడులు నిర్వహించిన సిట్ అధికారులు పలు రికార్డులను, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ సందర్భంగా పెట్టిన కేసుల్లో భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి మాత్రం బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు భాస్కర్ రెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మి, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేర్లతో ఉన్న ఆస్తులను స్థంబింప చేయడానికి అటాచ్ చేసుకుని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సిట్ కు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 64 కోట్ల ఆస్తులను జప్తుకు గురికానున్నాయి. ఒక వైపు దాదాపు నాలుగు నెలలుగా జైలులో ఉంటూ న్యాయ పోరాటం చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆస్తుల జప్తుతో కూటమి ప్రభుత్వం మరో పెద్ద షాక్ ఇచ్చినట్టువుతోంది.
