AP | ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనం..
- ప్రజాదర్బారులో ప్రజా సమస్యల పరిష్కారం.
- రెడ్డిగూడెంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : ప్రజాదర్బారు కార్యక్రమంతో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బారులో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
ఈ దర్బారుకు అనూహ్య స్పందన లభించింది. పెద్దసంఖ్యలో వచ్చిన అర్జీదారులు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పలు సమస్యలపై ఆయన అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకూ అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనమన్నారు.
ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు. ప్రతి అర్జీని ఆన్ లైన్ లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కారిస్తారని తెలిపారు. దీనివల్ల జవాబుదారీతనం ఉంటుందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించాలని అధికారులను కోరారు. ఇళ్లస్థలాలను మంజూరుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల కోసం, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వివిధ శాఖల పరిధిలో సమస్యల పరిష్కారం కోసం ఆర్జీలు సమర్పించారు. అధికారులతో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీయే కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

