శరీరం యొక్క రథయాత్ర…

శరీరం అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఆత్మ. శాశ్వతమైన ఆత్మ అశాశ్వతమైన శరీరంతో కలసి ప్రయాణం సాగించాలి. జీవనయానంలో రథికుడు జీవాత్మ. ఆత్మకు శరీరం రథంలాంటిది. రథాన్నిలాగే గుఱ్ఱాలు పంచేంద్రియాలు. సాధారణంగా గుఱ్ఱాల మధ్య సమన్వయం కుదరదు. ఔను, కాదనే విచికిత్సలో ఊగిసలాడడం సంకల్ప వికల్పాలుగా చెప్పుకోవచ్చు. ఒకటొకవైపు లాగితే మరొకటి మరొకవైపు లాగే ఈ సంకల్పవికల్పాలకు ప్రతీకయైన మనసనేది గుఱ్ఱాలకు వేసే కళ్ళెము. రథానికి సారథి బుద్ధి. రథికుని మార్గనిర్దేశనంలో సారథి గుఱ్ఱాలను సమన్వయపరచి, నియంత్రించి లక్ష్యంవైపు నడిపించాలి. రథికుడు ప్రమత్తుడైతే సారథిలో విచక్షణ స్థానంలో నిర్లిప్తత చోటుచేసుకుంటుంది. సారథి వివేక రహితుడైతే కళ్ళానికి విలువలేదు. మనసు సంయమనతను కోల్పోతే, ఇంద్రియాలు తమ ఇఛ్ఛమేరకు పరుగులు తీస్తాయి. సారథికి నైపుణ్యం లేకపోయినా గుఱ్ఱాలు సారథిని లెక్కచేయవు. నిరంతర చైతన్యశీలియైన ఆత్మ ప్రయాణాన్ని రథం నడకతో పోలుస్తున్నాడు… కఠోపనిషత్తులో యముడు.
రథము తయారయింది అంటే దాని ప్రయోజనం రహదారిపై ముందుకు సాగడమే కాని రథశాలలో ఉంచేందుకు కాదుకదా. రథానికి స్వయంగా నడిచే శక్తిలేదు. గుఱ్ఱాలు ముందుకు సాగే లక్షణాన్ని కలిగియుంటాయి. రథమూ, గుఱ్ఱాలూ రెండూ ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. సారథి అవివేకి అయితే గుఱ్ఱాలకు కళ్ళెం ఉన్నా లేకపోయినా ప్రయోజనం లేదు. నిజానికి, రథికుని ప్రయోజనం సిద్ధించేందుకు.. రథము, గుఱ్ఱాలు, కళ్ళెము, సారథి ఉన్నారు. కాని, వీటన్నింటి కొరకు రథికుడు లేడు. అందుకే స్థూలమైన దేహానికన్నా ఇంద్రియాలు, ఇంద్రియాలకన్నా మనస్సు, మనసుకంటే బుద్ధి, బుద్ధికంటే ఆత్మ ఉన్నతమైనవిగా పరిగణించాలి. సకల జీవులను ఆశ్రయించి ప్రకాశించే ఆత్మ… సూక్ష్మబుద్ధికి గోచరిస్తుంది. సూక్ష్మత ననుసరించి శ్రేష్ఠత నిర్ణయింప బడుతుంది… అంటుంది కఠోపనిషత్తు.
ప్రయాణమనేది ప్రయోజనాన్ని ఆశించి జరిగేది. ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరడం ప్రయాణం యొక్క ప్రయోజనం లేదా జీవనయాన సార్ధకత అనుకుందాము. అంతటా నిండియున్న ఆత్మ ప్రయాణం ఎక్కడికి? అవ్యక్తంగా అంతటా నిండిన ఆత్మ, వ్యక్తంగా ఆవిర్భవించడంతో, దానిపై అహంకార మమకారాలు, ఇష్టాయిష్టాలు, సుఖదు:ఖాలు, మానావమానాలు లాంటి అనేక ముసుగులు చేరడంవల్ల తానే పరిపూర్ణమనే భావనకు దూరమయి… వ్యగ్రతాభరితమై ఏదోకావాలనే తపనలో తహతహలాడుతుంది. భౌతిక సుఖాలు ప్రలోభాల రూపంలో పలకరించగా, వాటివెంట నడుస్తూ గమ్యాన్ని మరచిపోతుంది. పూర్ణత్వం తన స్వభావ స్థితియన్న సత్యాన్ని విస్మరించడం వల్ల కలిగిన మోహాది ముసుగులను తొలగించుకునేందుకై విజ్ఞానం అవసరమౌతుంది. సత్యసాధనలో ప్రలోభపూరితమైన అజ్ఞానమార్గం… చైతన్యభరితమైన జ్ఞానమార్గం రెండూ పలకరిస్తాయి. ఈ రెంటి మధ్య జరిగే సంఘర్షణయే కురుక్షేత్రం. ఇష్టాయిష్టాలు జీవన ప్రయోజనాన్ని అనుసరించి నడిస్తే… ”ఎఱుక” కలుగుతుంది. అదే సాక్షాత్కారం. అలాకాక, జీవనప్రయోజనం ఇష్టాయిష్టాలపై ఆధారపడి నడిస్తే, జనన మరణ చక్రబంధనాలలో మ్రగ్గిపోవడం జరుగుతుంది. తీక్షణమైన, ఏకాగ్రమైన బుద్ధి విచక్షణను పొందితే జీవన సాఫల్యసిద్ధి వైపు ప్రయాణం సజావుగా సాగుతుంది.
ఆప్నోతి ఇతి ఆత్మ… ఆప్నోతి అంటే పొందునది. దేనిని పొందుట? అజ్ఞానాన్ని పొందునది ఆత్మ. ”ప్రాజ్ఞుడైన” జీవుడు అజ్ఞానాన్ని పొందడం వల్ల పరమాత్మను విస్మరించి, ఇంద్రియ సౌఖ్యాలకై వెంపర్లాడడం, భార్యాపిల్లలనే భ్రమలో బంధాలను అతిగా పెంచుకోవడం… ”ఇష్టాయిష్టాలు”… ”నేను నాది” అనే భావనలో సంసారమనే పంజరంలో చిక్కుకుపోతాడు. ఇవన్నీ అజ్ఞానం వల్ల జనించేవే. హృదయాన్ని బంధించే ఈ అజ్ఞానం దూరమయితే మనుష్యులకు అమృతత్వం సిద్ధిస్తుంది. ప్రజ్ఞ అనగా జ్ఞానము… జ్ఞానాన్ని పొందినవాడు ప్రాజ్ఞుడు. అంతరంగంలో ప్రజ్ఞ సుషుప్త్యావస్థలో ఉంటుంది… సాధన ద్వారా ప్రాజ్ఞుడు దానిని జాగృతం చేసి పరమాత్మను తెలుసుకుంటాడు. ఆ సాధనలో గురువు మార్గాన్ని చూపుతాడు. యముడు ఆచార్యుడుగా నచికేతునికి బోధించిన మృత్యువును జయించే విధానం కఠోపనిషత్తులో విస్తృతంగా వివరించబడింది.

  • పాలకుర్తి రామమూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *