Tirupati | ఆరుగురు పై పీడీ యాక్ట్ నమోదు..

Tirupati | ఆరుగురు పై పీడీ యాక్ట్ నమోదు..

Tirupati, ఆంధ్రప్రభ : జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలకు భయభ్రాంతులు సృష్టిస్తున్న ఆరుగురు ప్రమాదకర నేరగాళ్ల పై జిల్లా పోలీసులు (Police) కఠిన చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సుబ్బరాయుడు (SP Subbarayudu) ఆదేశాల మేరకు ఆరుగురి పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద కేసు నమోదు చేసి నిర్బంధించారు. డ్రగ్స్, హత్య, దొంగతనాలు, కిడ్నాప్‌లు, గంజాయి అక్రమ రవాణా వంటి పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారి పై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం..
ముఖ్యంగా నేరాలకు దారి తీసే పరిస్థితులను ముందే అరికట్టాలనే లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాలు, రౌడీయిజం, మాదకద్రవ్యాల విక్రయాలు, భూకబ్జాలు, మహిళల పై నేరాలకు పాల్పడే వారి కార్యకలాపాలను పూర్తిగా అణచివేసేందుకు ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఈ చర్య ద్వారా, చట్టాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన ఉన్న ఇతరులకు కూడా గట్టి గుణపాఠం చెప్పినట్లవుతుందని ఎస్పీ అన్నారు. తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతకు, జిల్లాలో శాంతిని కాపాడేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

పోక్సో ((POCSO) కేసుల పై ప్రత్యేక దృష్టి..
మైనర్ బాలికల పై అఘాయిత్యాలకు పాల్పడే పోక్సో నిందితుల పై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటువంటి నేరాలకు పదే పదే పాల్పడేవారి పై రౌడీషీట్‌లు తెరవడమే కాకుండా, వారి పై కూడా పీడీ యాక్ట్ నమోదు చేయడానికి సమాచారం సేకరిస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. త్వరలో గంజాయి, అక్రమ మద్యం విక్రయాలు, భూకబ్జాలకు పాల్పడేవారి పై కూడా పీడీ చట్టాన్ని అమలు చేయనున్నట్లు హెచ్చరించారు.

పీడీ యాక్ట్ నమోదైన వీరి పైనే..

పీడీ యాక్ట్ (pd act) నమోదు చేసిన ఆరుగురి పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌లు, గంజాయి వంటి తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

  • షేక్ కాలేషా (33, గూడూరు): 10 కేసుల్లో నిందితుడు. హత్య, హత్యాయత్నం, గంజాయి, దొమ్మి వంటి నేరాల్లో పాలుపంచుకున్నాడు.
  • కనుపూరు శ్రీహరి @ జెమిని (38, గూడూరు): 6 కేసుల్లో నేరస్తుడు. గంజాయి, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
  • సయ్యద్ అజీమ్ (30, తిరుపతి): 14 కేసుల్లో నిందితుడు. హత్య, కిడ్నాప్, దొంగతనం, గంజాయి కేసుల్లో ఇతని ప్రమేయం ఉంది.
  • వట్టికుంట అరుణ్ కుమార్ (32, చిత్తూరు జిల్లా): 4 కేసుల్లో నిందితుడు. కిడ్నాప్, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
  • మీధూరి సునీల్ (29, నెల్లూరు): 34 కేసుల్లో నేర చరిత్ర ఉంది. దొంగతనాలు, వరకట్నం, మట్కా కేసుల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి.
  • ప్రసన్న కుమార్ (32, సూళ్లూరుపేట): 18 కేసుల్లో నిందితుడు. పగటిపూట దొంగతనం, హత్యాయత్నం, గంజాయి కేసుల్లో ఇతను నిందితుడు.

ప్రజలు సహకరించాలి :

ప్రజా శాంతికి భంగం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు గమనించినా, ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కి (Police Station) లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ (ఫోన్ నెం: 112)కు సమాచారం అందించాలని ఎస్పీ సుబ్బరాయుడు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Leave a Reply