ఆఫ్రికాలో ఐదుగురు భార‌తీయుల కిడ్నాప్‌

ఆఫ్రికాలో ఐదుగురు భార‌తీయుల కిడ్నాప్‌

  • 400 మందిని సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు

ఇంట‌ర్నేష‌నల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆఫ్రికా దేశంలో ఐదుగురు భార‌తీయులు కిడ్నాప్ అయిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగు చూసింది. భారతదేశానికి చెందిన కార్మికులు ఆఫ్రికా దేశాల‌వైపు ఉపాధి కోసం వెళుతుంటారు. అధికారిక‌ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం మాలిలో 400 మంది భారతీయులు(Indians) పనిచేస్తున్నారు. అలాగే ప‌శ్చిమ మాలిలోని కౌబి ప్రాంతానికి ఒక కంపెనీ త‌రుఫున భార‌తీయులు వెళ్లారు.

కౌబి ప్రాంతంలో విద్యుదీకరణ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు భారతీయ కార్మికులను గుర్తు తెలియని ముష్కరులు అపహరించారు. ఈ విష‌యాన్ని కార్మికులను నియ‌మించుకున్న కంపెనీ ప్రతినిధి ధ్రువీక‌రించారు. వారిని విడిపించ‌డానికి ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌తో ఇతర భారతీయ ఉద్యోగులందరినీ రాజధాని బమాకో(Bamako)లోని సురక్షిత ప్రదేశాలకు తరలించామని కంపెనీ ప్ర‌క‌టించింది.

ఈ కిడ్నాప్‌కు బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఏ సంస్థ ప్రకటించనప్పటికీ, అల్-ఖైదా, ఐఎస్ఐఎస్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపుల పని అయ్యి ఉంటుందని ఆ దేశానికి చెందిన‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంవత్సరం జూలైలో ముగ్గురు భారతీయ పౌరులు కూడా కిడ్నాప్‌కు గురయ్యారు. ఆ సమయంలో, అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్(Jamaat Nusrat al-Islam wal-Muslimeen) బాధ్యత వహించింది.

ఆఫ్రికాలో విదేశీయుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లు జ‌రుగుతున్నాయి. 2012 నుంచి మాలిలో తిరుగుబాటుతో ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కిడ్నాప్‌లు(Kidnappings) జ‌రుగుతున్నాయి. విమోచన క్రయధనం కోసం విదేశీయులను కిడ్నాప్ చేయడం సర్వసాధారణమైంది. సహెల్ ప్రాంతం ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా మారిపోయింది.

ప్రపంచంలోని ఉగ్రవాద మరణాలలో సగానికి పైగా ఇక్కడే సంభవిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ముగ్గురు విదేశీయులు(Three Foreigners) అపహరణకు గురయ్యారు. కొంత డబ్బు చెల్లించిన అనంతరం గతవారం వారు విడుదల అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాలిలో సైనిక పాలన కొనసాగుతుంది. దేశంలో అల్- ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపులతో సంబంధం ఉన్న దుండగులను కట్టడి చేయడానికి పనిచేస్తున్నామని సైన్యం చెబుతోంది.

Leave a Reply