అధికారుల ఆటవిడుపు
- ప్రకృతి సౌందర్యానికి నిలయమైన విజయవనం
- కార్తీక వనసమారాధనలో కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి సమీపంలో ఉన్న ప్రకృతి సౌందర్యంతో కట్టిపడేసే పర్యాటక ప్రాంతం విజయవనం (పుల్లయ్య పార్క్) అని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి(Dr. A. Siri) అభివర్ణించారు. ఈ రోజు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, వనసమారాధన ఆచరణ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడమే కాకుండా ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్(Joint Collector Nurul Qamar), జిల్లా అధికారులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపొందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవనాన్ని పర్యాటక పరంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు విజయవనం పాల్పడాలని పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు.
ఆటపాటల సందడి మధ్య అధికారి బృందం రోజువారీ బాధ్యతల నుంచి కాసేపు విరామం తీసుకున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సహా జిల్లా అధికారులు ఆటపాటలతో ఓలలాడారు. మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్(Tug of War), వాలీ బాల్, షటిల్, బెలూన్ పిక్ వంటి ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ షటిల్, క్యారమ్, మ్యూజికల్ చైర్స్ ఆడగా, జాయింట్ కలెక్టర్ టగ్ ఆఫ్ వార్, షటిల్, క్యారమ్ పోటీల్లో పాల్గొన్నారు. టగ్ ఆఫ్ వార్, షటిల్ ఆటల్లో జాయింట్ కలెక్టర్ టీం విజయం సాధించింది.

కార్యక్రమ ప్రారంభంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొక్కలు నాటారు. తరువాత ఉసిరి చెట్టు కింద పూజాధికాలు నిర్వహించారు. ప్రత్యేక బహుమతులు కూడా అందజేశారు. షటిల్ గేమ్‌లో గెలిచిన జాయింట్ కలెక్టర్, మ్యూజికల్ చైర్స్(Musical Chairs)లో విజయం సాధించిన సాంఘిక సంక్షేమ అధికారి రాధిక, బెలూన్ పిక్ గేమ్‌లో గెలిచిన అనురాధ, అగ్నిమాపక శాఖ అధికారులకు కలెక్టర్ తులసి బ్యాగులను బహుమతులుగా అందజేశారు.

కార్యక్రమంలో ఫారెస్ట్ కన్సర్వేటర్ బి. వి. కృష్ణమూర్తి, డీఆర్ఓ. సి. వెంకట నారాయణమ్మ, జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


