- ఒకే కళాశాలలో వారం రోజుల్లో రెండో విషాదం
చిత్తూరు, (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు సమీపంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమను తిరస్కరించిందని నిరాశ చెంది విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంగారెడ్డిపల్లి, సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన రుద్ర అనే యువకుడు బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
సహచర విద్యార్థినిపై కొంతకాలంగా ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అయితే, ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో రుద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం కళాశాల మూడవ అంతస్తు పైకి వెళ్లి క్షణికావేశంలో కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన రుద్రను కళాశాల యాజమాన్యం వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే రుద్ర మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదే కళాశాలలో గత వారం రోజుల కిందట నందిని రెడ్డి అనే విద్యార్థిని ప్రాక్టికల్స్‌కు అనుమతించలేదని నిరాశ చెంది మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
వారం రోజుల్లో రెండోసారి ఒకే కళాశాలలో విద్యార్థులు ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం తల్లిదండ్రులు, సహచర విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇటీవల పెనుమూరు మండలంలో కూడా ప్రియురాలి ఎడబాటు తట్టుకోలేక విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలోనే చోటు చేసుకోవడం మరింత విషాదం. ఈ ఘటనపై చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

