ADB | అటవీ భూముల్లో గుడిసెలు… తొలగించిన అధికారులు
జన్నారం, ఫిబ్రవరి 18 (ఆంధ్రప్రభ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యం పరిధిలోని జన్నారం, కొత్తూరు పల్లె గ్రామాల సమీపాన ఉన్న గడ్డంగూడలోని 50గిరిజనుల గుడిసెలను అటవీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున మూకుమ్మడిగా జేసీబీ, ట్రాక్టర్లతో తొలగించారు. మండలంలోని జన్నారం,కొత్తూరుపల్లె గ్రామ సమీపాన గడ్డంగూడలో గత కొన్ని ఏండ్లుగా గిరిజనులు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో నిద్రిస్తున్న సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీ, ట్రాక్టర్లతో తమ గుడిసెలను తొలగించారని పలువురు బాధిత గిరిజనులు ఆరోపించారు.
తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని ఆ గిరిజనులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు బోరున విలపించారు. ఈ సందర్భంగా ఇద్దరు బాధిత గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై జన్నారం ఇన్చార్జి అటవీ క్షేత్రాధికారిణి ఎస్.సుష్మారావును ఉదయం ప్రశ్నించగా, జన్నారం అటవీ బీట్ లోని కంపార్ట్ మెంట్ నెంబర్ 308లో అక్రమంగా పలువురు గిరిజనులు గుడిసెలు వేశారన్నారు. అక్రమంగా వేసిన ఆ గుడిసెలను చట్ట ప్రకారం తొలగించామని ఆమె చెప్పారు. తాము ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు.
