అదే.. మనం ఇచ్చే నిజమైన నివాళి..
ఉమ్మడి మెదక్ బ్యూరో, (ఆంధ్ర ప్రభ): దేశ సమైక్యతకు మాజీ హోంమంత్రి సర్దార్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. రాష్ట్రీయ ఏకతా దివాస్ (రాష్ట్ర ఐక్యతా దినోత్సవం) సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ – 2K రన్” నిర్వహించగా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ మాట్లాడుతూ.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివాస్ గా పిలుస్తామన్నారు. వల్లభాయ్ పటేల్ పోరాట పఠిమ ద్వారా భారత దేశ సమగ్రతను, ఐక్యతను చాటారన్నారు. వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు చేసిన కృషి, నాయకత్వ లక్షణాలను మెచ్చి మహాత్మా గాంధీ ఆయనకు “సర్ధార్” బిరుదును ఇచ్చారని గుర్తుకు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తో మన రాష్ట్రానికి ప్రత్యేక అనుబంధం వుందని, 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మనం నిజాం నిరంకుశ పాలనలో నే గడిపామని, సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోరాటపఠిమ కారణంగా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సంస్థానం భారత దేశంలో విలీనం కావడం జరిగిందన్నారు. వందలాది సంస్థానాలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ.. జాతీసమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ సంస్థానాలుగా ఉన్న భారత దేశాన్ని ఒక్కటిగా చేసి దేశ సౌభ్రాతృత్వం పరిఢవిల్లెలా కృషి చేశారన్నారు. దేశ ఐక్యతకు పాటుపడిన గొప్ప నాయకుడనీ, ఉక్కు మనిషిగా పిలవబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్ధం గుజరాత్ లోని నర్మదా నది పై ప్రపంచంలోనే అత్యంత ఎతైన 182 మీటర్ల విగ్రహాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఆయన జయంతిని రాష్ట్రీయ ఏకతా దివాస్ ను పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యంలో ఈ ‘రన్ ఫర్ యూనిటీ” 2k రన్ నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ 2k రన్ లో సంగారెడ్డి పట్టణంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, ఎఆర్ డిఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్, డానియోల్, సిబ్బంది మరియు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

